మహిళా సమాఖ్యలు అభివృద్ధి సాధించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

మహిళా సమాఖ్యలు అభివృద్ధి సాధించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ సిటీ, వెలుగు: జిల్లాలోని సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలు అభివృద్ధి పథంలో కొనసాగాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హనుమకొండలోని డీసీసీబీలో నిర్వహించిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాలకు టీజీ కోఆపరేటివ్ బ్యాంక్ రాష్ట్ర చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో పాటు కలెక్టర్ చీఫ్​ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహకార సంఘాలు, సమాఖ్యలు కలిసికట్టుగా ఉంటేనే సహకార వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

 ప్రభుత్వం వినూత్నంగా సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలతో పెట్రోల్ బంకులు, సెరికల్చర్ యూనిట్లు, సోలార్ యూనిట్లు పెట్టిస్తున్నట్లు చెప్పారు. అనంతరం టెస్కాబ్  చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువత, వ్యాపారులకు వరంగల్ డీసీసీబీతోపాటు రాష్ట్రంలోని మరో 9 డీసీసీ బ్యాంక్ లు రుణాలను అందించి అభివృద్ధికి పాటుపడుతున్నాయన్నారు. 

సహకార సంఘాల సీఎండీ అన్నపూర్ణ మాట్లాడుతూ కమర్షియల్ బ్యాంకుల మాదిరిగానే సహకార బ్యాంకులు విజయవంతంగా సేవలు అందించాలన్నారు. తమ సంస్థల రుణాలతోనే పలు మహిళా సమాఖ్య లు విజయవంతంగా నడుస్తున్నాయని డీసీసీబీ సీఈవో వజీర్ సుల్తాన్ అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీసీవో సంజీవ రెడ్డి, నాబార్డు డీజీఎం చంద్రశేఖర్, హనుమకొండ డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.