ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి :  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  •     కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

బోధన్, వెలుగు  : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్​లో ఆర్వోలు, సహాయ ఆర్వోల శిక్షణ తరగతుల కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొని మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,  ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా చూడాలన్నారు.  ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. సమయ పాలన పాటిస్తూ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా వ్యవహరించాలన్నారు.

పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని, బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగినంత కోరం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలని సూచించారు.  ఓటింగ్ కంపార్ట్ మెంట్, సిట్టింగ్ ఏర్పాట్లు తదితర వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ‘నోటా’ సింబల్ ను సరి చూసుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.  కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈవో అశోక్, ఏసీపీ రామారావు, డీఎల్ పీవో నాగరాజు,  ఆర్వోలు, సహాయ ఆర్వోలు పాల్గొన్నారు.