సూర్యాపేట, వెలుగు: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9 వరకు సంబంధిత మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో హాజరై ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి తేజస్ నందులాల్ పవార్ ప్రకటనలో కోరారు. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ముందస్తుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఆత్మకూరు (ఎస్), జాజిరెడ్డిగూడెం ,నాగారం, నూతనకల్ ,మద్దిరాల, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
