హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలి : ఉదయ్ కుమార్

హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలి : ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : హైవే పనులతో పాటు భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్  సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్  ఛాంబర్ లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవేకు సంబంధించి జిల్లాలోని కొల్లాపూర్  మండల పరిధిలోని వరిదేల గ్రామంలో భూసేకరణను వేగవంతం చేయాలని, భూ యజమానులు, రైతులకు నష్ట పరిహారాన్ని త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

కల్వకుర్తి నుంచి కొల్లాపూర్  వరకు 79 కిలోమీటర్ల కొనసాగుతున్న విస్తరణ పనుల్లో  వేగం పెంచాలని సూచించారు. పెండింగ్  పనులన్నీ త్వరగా పూర్తి కావాలని, పరిహారం చెల్లింపులపై త్వరలో రివ్యూ చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు 33 కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు హైవే, ఆర్అండ్ బీ అధికారులు కలెక్టర్  దృష్టికి తీసుకువచ్చారు. ఆర్అండ్ బీ ఎస్ఈ ధర్మారెడ్డి, కొల్లాపూర్  ఆర్డీవో నాగరాజ్ పాల్గొన్నారు.

లోక్ సభ ఎన్నికలు విజయవంతం

ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో పార్లమెంట్  ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారని కలెక్టర్  ఉదయ్ కుమార్  పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో పలువురు అధికారులు, ఉద్యోగులను బొకేలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయం, సమిష్టి కృషితోనే జిల్లాలో ఎన్నికలు సక్సెస్​ అయ్యాయని తెలిపారు. 

ఎన్నికల షెడ్యూల్  విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్  రూముల్లో భద్రపరిచేంత వరకు వనపర్తి, గద్వాల కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు, నోడల్  ఆఫీసర్లు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్వోల సహకారంతో విజయవంతం చేయగలిగామని చెప్పారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం హర్షణీయమన్నారు.