వారం రోజుల్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు : వినయ్ కృష్ణారెడ్డి -

వారం రోజుల్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు  : వినయ్ కృష్ణారెడ్డి -
  • కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -  
  • జైతాపూర్‌‌‌‌లో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన 

ఎడపల్లి, వెలుగు: వారం రోజుల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి అన్నారు.  మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని  జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో  కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ గ్రామంలో 74 ఇండ్ల నిర్మాణం చేపట్టగా15 ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయి.  ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను పరిశీలించారు. 

చివరి విడతగాలక్ష రూపాయలు రాలేదని కలెక్టర్ కు లబ్ధిదారులు తెలపగా వెంటనే బిల్లులు మంజూరు చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు.  ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథ నీటి నల్లాల సరఫరా వంటి సదుపాయాలను సత్వరమే కల్పించాలని ట్రాన్స్‌‌కో ఏడీ ముఖ్తార్, ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్  డీఈ రాకేశ్ లకు సూచించారు. ప్రారంభోత్సవాల నాటికి, ఏ ఒక్క చిన్న పని కూడా పెండింగ్ లో లేకుండా, అన్ని వసతులు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీ.డీ పవన్ కుమార్, హౌసింగ్​ ఏఈ నివర్తి, తహసీల్దార్​ దత్తద్రి, ఎంపిడిఓ శంకర్​, ఏఓ సిద్ది రామేశ్వర్​ , మిషన్​ భగీరద, పంచాయతీ రాజ్​ అధికారులు ఉన్నారు.

పాస్ బుక్ లేకున్నా... ఎరువులు పంపిణీ చేయండి 

ఎడపల్లి, వెలుగు :  పట్టాపాసుపుస్తకం లేకున్నా రైతులకు సింగిల్​ విండోల ద్వారా ఎరువులు ఇవ్వాలని , ఎరువుల కోసం రైతులను ఇబ్బంది పెట్టవద్దని జిల్లా కలెక్టర్​  వినయ్​ కృష్ణా రెడ్డి సింగిల్​ విండో అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. మంగళవారం ఆయన ఎడపల్లి మండలం లోని  జైతాపూర్, తానాకలాన్ గ్రామాలలో పల్లె దవాఖాన, ఎరువుల గోదాములను తనిఖీ చేశారు.

 జైతాపూర్ గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రూర్బన్ పథకం కింద నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనానికి విద్యుత్ వసతి లేకపోవడాన్ని గమనించి, తక్షణమే విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ తానాకలాన్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.