
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఈ నెల 10 నుంచి 16 వరకు మహిళా శక్తి సంబురాలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. 8న మండల సమాఖ్యలతో, 9న విలేజ్ సమాఖ్యలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అర్హతగల ప్రతి సంఘానికి ఆ రోజు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేయాలన్నారు. ప్రజాప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. ఫ్రీ బస్ మొదలుకొని శక్తి క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్‌లు, వడ్ల కొనుగోలు సెంటర్లు, పెట్రోల్ బంక్‌లు, సోలార్ పవర్ ప్లాంట్లు మంజూరు చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించేలా గవర్నమెంట్ తోడ్పాటు అందిస్తోందన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదామ్ కలెక్టర్ విజిట్..
నిజామాబాద్ వినాయక్‌నగర్‌లోని ఈవీఎం గోదామ్‌ను సోమవారం కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సందర్శించారు. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా గోదామ్ సీళ్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు చెక్ చేసి పోలీస్ బందోబస్తును సమీక్షించారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఏవో ప్రశాంత్, సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు.