నిజామాబాద్, వెలుగు: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లాలోని ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్ఎంలతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలన్నారు. జిల్లాలో గుర్తించిన 59 వేల వయోజనులను అక్షరాస్యులుగా మార్చడానికి 5,900 మంది వలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఒక్కో వలంటీర్ పది మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. స్కూల్స్‌లో ఉన్న స్క్రాప్‌ను నిబంధనల ప్రకారం తొలగించాలని, ఫర్నిచర్ రిపేర్ విషయంలో అశ్రద్ధ చేయొద్దన్నారు. టాయిలెట్స్‌లో నీటి సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. సివిల్ వర్క్స్ పెండింగ్ పెట్టొద్దని, ప్రతి బడిలో రీడింగ్ కార్నర్, లైబ్రరీ తప్పక ఉండాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం పౌష్టికాహారం అందించేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. ఆధార్ కార్డులేని పిల్లలను గుర్తించాక వారికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చి ఆధార్ కోసం దరఖాస్తు చేయించాలని కలెక్టర్ సూచించారు. అడిషనల్కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.
