మెదక్​ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ

మెదక్​ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 27,16,256 ఓటర్లు
  • 3,324 పోలింగ్​ కేంద్రాలు 
  • జిల్లాలకు చేరిన ఈవీఎంలు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉమ్మడి మెదక్​ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలున్నాయి.  మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు,  ఎస్పీలు ఎలక్షన్​ కమిషన్ గైడ్​లైన్స్​కు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన ప్రకటించిన తుది ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా మొత్తం 27,16,256 మంది ఓటర్లు ఉన్నారు.  

వారందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 3,324 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేక పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయగా, తొలిసారిగా 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు,  దివ్యాంగులు ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఈవీఎంలు ఇదివరకే జిల్లాలకు చేరకున్నాయి.  

మెదక్ జిల్లాలో..

మెదక్  జిల్లాలో  మెదక్​, నర్సాపూర్​ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.​  మొత్తం 4,34,900 మంది ఓటర్లు ఉన్నారు.  వీరిలో పీడబ్లూడీ ఓటర్లు 8,882 మంది, 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 4,165 మంది, 10 నుంచి -19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 15,715 మంది ఉన్నారు. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 579 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.  ఇందులో రూరల్​లో 514 పోలింగ్ స్టేషన్లు, అర్బన్​లో 65 పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 13,55,958 మంది ఓటర్లు ఉన్నారు. పటాన్ చెరులో అత్యధికంగా 3,80,948 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 125 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు, 354 మంది సర్వీస్ ఓటర్లు, 74 మంది  ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 1,594 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వారీగా పరిశీలిస్తే సంగారెడ్డిలో 281, నారాయణఖేడ్ లో 296, ఆందోల్​లో 313, జహీరాబాద్ లో 313, పటాన్ చెరులో 391 పోలింగ్ కేంద్రాలు  ఉన్నాయి.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్​ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 9,25,398 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 1,151 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా సిద్దిపేటలో 273, గజ్వేల్​లో 321, దుబ్బాకలో 253, హుస్నాబాద్​లో 304 పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయి.