జనగామ అర్బన్/ మణుగూరు/ దంతాలపల్లి (నర్సింహులపేట), వెలుగు: ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు 41 కిలోల కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా కఠిన చర్చలు తప్పవని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. మంగళవారం జనగామ, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జనగామ జిల్లా పెద్దపహాడ్పీఏసీఎస్కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ట్యాబ్ ఎంట్రీలను వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఇళ్ల గణన ప్రక్రియను పరిశీలించి, పర్యాటక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖలు యువత కోసం ప్రవేశపెట్టిన మ్యూజియాలజీ, ఆర్కియాలజీ సర్టిఫికెట్ కోర్సుల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో పీఎం జన్మన్, డీఏజీయూఏ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, 'జన్ భాగీదారి - సర్వే డోర్, సర్వే విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్తనిఖీ చేశారు.
సీతారాంపురం శివసాయి రైస్‌మిల్లును తనిఖీ చేసి ధాన్యం నిల్వలపై ఆరా తీశారు. అంతకుముందు మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ స్నేహశబరీశ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఆఫీసర్లను ధాన్యం సేకరణ వివరాలను అడుగగా, చెప్పలేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
