యువతలో పెరుగుతున్న కొత్త రకం క్యాన్సర్: ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టరుని కలవాల్సిందే..!

యువతలో పెరుగుతున్న కొత్త రకం క్యాన్సర్: ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టరుని కలవాల్సిందే..!

సాధారణంగా వృద్ధులలో అలాగే వయస్సు పైబడిన వారిలో వచ్చే పెద్దప్రేగు క్యాన్సర్ ఈ రోజుల్లో యువతలో కూడా ఎక్కువవుతోంది. దీనికి సంబంధించిన ఒక  కొత్త అధ్యయనం ప్రకారం, 1990లో పుట్టిన వారికి 1950లో పుట్టిన వారితో పోలిస్తే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువట. ఫ్లోరిడాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ యువతలో ఇలాంటి క్యాన్సర్ కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన 5 ముఖ్యమైన పెద్దప్రేగు క్యాన్సర్ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దని  ఎందుకంటే, క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది అని అన్నారు.

1. మలంలో రక్తం: డాక్టర్ సల్హాబ్ చెప్పిన దాని ప్రకారం, మలంలో రక్తం కనిపించడం పెద్దప్రేగు క్యాన్సర్‌కు ఒక ముఖ్యమైన సంకేతం. మీ మలంలో రక్తం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మలంలో రక్తం సాధారణంగా మొలలు వల్ల కూడా రావొచ్చు, కానీ రక్తం పడటం ఆగకపోతే లేదా మళ్లీ మళ్లీ వస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

2. భరించలేని కడుపు నొప్పి: కడుపు నొప్పి వస్తే కూడా తేలికగా తీసుకోవదు. మీకు ఎటువంటి కారణం లేకుండా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మీరు తినే  ఆహార అలవాట్లు మార్చినా కూడా కడుపు నొప్పి అలాగే ఉంటే ప్రమాదకరం. ఈ నొప్పి పెద్దప్రేగు క్యాన్సర్‌కు ఒక సూచన కావచ్చు. కడుపు నొప్పి ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

3. బలహీనత లేదా అలసట: ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం కూడా మంచి లక్షణం కాదు. ఎంత రెస్ట్ తీసుకున్నా అలసటగా లేదా బలహీనంగా అనిపిస్తే ఏదో ఒక సమస్య ఉండొచ్చు. చాలా మంది ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కానీ డాక్టర్ సల్హాబ్ దీనిని చాలా ముఖ్యమైన సంకేతంగా పేర్కొన్నారు. యువకులు ముఖ్యంగా బిజీగా ఉండేవాళ్లు దీన్ని ఒత్తిడి లేదా నిద్ర లేకపోవడం వల్ల అనుకుంటారు. దింతో దీనివల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుంది.

4. అలవాట్లలో మార్పులు:  మీరు మల విసర్జనలో మార్పులు రావడం, ముఖ్యంగా కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే  అది చాల ఆందోళన కలిగించే విషయం. ఈ మార్పులలో ఎక్కువగా మలబద్ధకం, వాంతులు లేదా మీరు ఎన్నిసార్లు టాయిలెట్‌కి వెళ్తున్నారనే దానిలో మార్పులు ఉండొచ్చు. ఇలా ఉంటే కూడా మీరు మీ డాక్టరుని కలవాలి.

ALSO READ : హైదారాబాద్ ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

5. ఇతర లక్షణాలు చూస్తే : డాక్టర్ సల్హాబ్ పెద్దప్రేగు క్యాన్సర్  కొన్ని లక్షణాలు కూడా చెప్పారు. వాటిలో కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం లేదా పదే పదే జ్వరం రావడం వంటివి ఉన్నాయి. ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావొచ్చు, కానీ ఇవన్నీ కలిపి కనిపిస్తే పెద్దప్రేగు క్యాన్సర్‌ సూచించవచ్చు. అందుకే ముందుగా టెస్టులు చేయించుకోవడం  చాలా ముఖ్యం.

ఈ పరిశోధనలో సారా చార్ మాట్లాడుతూ  50 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారిలో పెద్దపేగు క్యాన్సర్‌లు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని అన్నారు. క్యాన్సర్‌ను ముందే గుర్తించడం, నివారించడం, చికిత్స చేయడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటి జన్యుపరమైన కారణాలు కూడా పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి అని అన్నారు.