సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కాసారాబాద్ లో సంతోష్‌బాబుకు చెందిన ఫామ్ హౌజ్ అంతిమ సంస్కారాలు జరిగాయి.  ఇందులో 16 బీహార్‌ రెజిమెంట్‌ బృందం పాల్గొంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతించారు. సంతోష్ భౌతిక కాయంపై జాతీయ జెండా కప్పి నివాళులర్పించిన ఆర్మీ అధికారులు.

అంతకుముందు విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు బజార్‌, పాత బస్టాండ్‌, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా 5కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసరాబాద్ వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. సంతోష్‌ బాబును కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంతోష్ బాబు .. అమర్‌ రహే, వందే మాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ ప్రజలు వారి ఇళ్లపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలతో వీడ్కోలు పలికారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, అర్వింద్, వివేక్ వెంకట స్వామి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంతోష్‌బాబు అంత్యక్రియలకు హాజరయ్యారు.