నీటమునిగిన కాలనీలు.. ఇండ్లల్లోకి చేరిన వరద

నీటమునిగిన కాలనీలు.. ఇండ్లల్లోకి చేరిన వరద

హైదరాబాద్, వెలుగు: సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. అత్యధికంగా హయత్​నగర్ లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాలనీలు, రోడ్లన్నీ నీటమునిగాయి. కొన్ని కాలనీల్లో నడుం లోతు వరద వచ్చింది. వరద ఉధృతికి కొన్ని చోట్ల పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. తెల్లారి లేచే సరికి ఇండ్ల చుట్టూ వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలు, నీళ్లు, తిండి లేక సాయం కోసం ఎదురుచూశారు. స్టూడెంట్లు, ఉద్యోగులు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లలేకపోయారు. సరూర్ నగర్ లోని సీసల బస్తీలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. కాగా, సహాయక చర్యలు చేపట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారు. గతంలో కనీసం బోట్లను అందుబాటులో ఉంచగా, ఈసారి అదీ చేయలేదు. 

చెరువులు, నాలాలు ఉప్పొంగి.. 

సరూర్​నగర్​లోని కోదండ రామ్ నగర్ కాలనీ, పీ అండ్ టీ కాలనీ, వివేకానందనగర్, సీసల బస్తీ, నాగోల్ లోని అయ్యప్ప కాలనీ,  బేగంపేట్​లోని మయూరిమార్గ్, బ్రాహ్మణివాడ, మీర్ పేట్​లోని మిథిలానగర్, పీర్జాదిగూడలోని శ్రీపాద ఎన్ క్లేవ్, గాజులరామారంలోని ఓక్షిత్ ఎన్ క్లేవ్ ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద వచ్చింది. బేగంబజార్ ను వరద ముంచెత్తడంతో కొన్ని దుకాణాల్లో సామగ్రి పాడైపోయింది. హయత్ నగర్, ఖైరతాబాద్, మలక్ పేట్, నాంపల్లి, యాకుత్ పురా, అంబర్ పేట్, చంపాపేట్, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద చేరింది. కోఠిలో వరదకు ఓ బైక్ కొట్టుకుపోయింది. మలక్ పేట్ రైల్వే ట్రాక్ వద్ద లాల్ హజార్ నాలా ఉప్పొంగడంతో పద్మానగర్ లో దాదాపు 150 ఇండ్లలోకి వరద వచ్చింది. ఆజంపురాలోని గట్ పట్​నగర్ లోనూ వంద ఇండ్లలోకి నాలా నీళ్లు చేరాయి. సూరారం పెద్ద చెరువు ఉప్పొంగి గాజులరామారంలోని ఓక్షిత్ ఎన్ క్లేవ్ కాలనీ నీటమునిగింది.