
- పర్యాటకుల్లో భారత్, చైనా, ఫిలిప్పీన్స్ వాసులు
న్యూయార్క్: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సు బోల్తా పడి ఐదుగురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. టూరిస్ట్‌లు శుక్రవారం కెనడా సరిహద్దులోని నయాగరా జలపాతాన్ని సందర్శించి న్యూయార్క్ సిటీకి తిరిగి వస్తుండగా బఫెలోకు 40 కి.మీ. దూరంలో పెంబ్రోక్ దగ్గర్లో రాష్ట్ర రహదారిపై బస్సు బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 54 మంది ఉన్నారని, మృతుల్లో పిల్లలు ఎవరూ లేరని న్యూయార్క్ స్టేట్ పోలీస్కమాండర్ మేజర్ ఆండ్రీ రే తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైందని, గాయపడిన వారిని నాలుగు హెలికాప్టర్లు, అంబులెన్స్‌లలో దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి ఫస్ట్ ఎయిడ్ చేయించి పంపించినట్టు తెలిపారు.
గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బస్సును వేరే ఇతర వెహికల్స్ ఢీకొట్టలేదని, డ్రైవరే నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడిందని ఆయన చెప్పారు. అలాగే, టూరిస్ట్‌లలో ఎక్కువ మంది భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.