ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో సీనియర్​ అంతర్​జిల్లా బ్యాడ్మింటన్​చాంపియన్​షిప్​పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. సింగరేణి జనరల్‌‌ మేనేజర్‌‌ కె.నారాయణ, మేయర్‌‌ అనిల్ కుమార్‌‌, డిప్యూటీ మేయర్ అభిషేక్‌‌ రావు, ఏసీపీ గిరి ప్రసాద్‌‌ హాజరై పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పది జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా, పోటీలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఉపాధ్యక్షుడు బంగారి రాజయ్య, డాక్టర్ బంగారు స్వామి, చీఫ్ రిఫరీ గడ్డం రమేశ్, రవీందర్ గౌడ్, రామకృష్ణ,  దేవయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఇక దేశమంతటా తెలంగాణ స్కీమ్​ల: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మెట్ పల్లి, వెలుగు: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు ధ్వంసమైన రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.26.98 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నోటికి ఎంత వస్తే అంత జుటా మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 20 శాతమైనా ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని విద్యాసాగర్​ అన్నారు. 

ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్​ చేయండి

గంగాధర, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్​కుమార్​ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను చొప్పదండి నియోజకవర్గ ప్రజలు సక్సెస్​చేయాలని ప్రజాసంగ్రామ యాత్ర  సహ ప్రముఖ్​ జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. గంగాధర మండలం మధురానగర్​లో చొప్పదండి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్​కుమార్ ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాసంగ్రామ యాత్ర కో ఆర్డినేటర్ పి.శ్యాంగౌడ్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్​యాదవ్, జిల్లా కార్యదర్శి సత్యం, విద్యాసాగర్, అశోక్ పాల్గొన్నారు.

30‌‌3 గ్రామాలకు సీనరేజీ ఫండ్స్​ చెల్లించాలి

కరీంనగర్ టౌన్,వెలుగు: గ్రానైట్​వ్యాపారులు సీనరేజీ కింద 303 గ్రామాలకు సొమ్ము చెల్లించాలని, లేకపోతే ఆ గ్రామాలు రణరంగంగా మారతాయని బీజేపీ జాతీయ నాయకుడు పేరాల శేఖర్ రావు హెచ్చరించారు. శనివారం కరీంనగర్​లో విలేకరులతో శేఖర్ రావు మాట్లాడుతూ గ్రానైట్స్ క్వారీలతో దెబ్బతింటున్న గ్రామాలకు సీనరేజి కింద రూ.200కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రానైట్స్ తో  దాదాపు 303 గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయన్నారు. గ్రానైట్ సంస్థలకు విజిలెన్స్ విధించిన రూ.750కోట్ల జరిమానాను కేసీఆర్ ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని ప్రశ్నించారు. గ్రానైట్ ప్రభావిత గ్రామాలకు జమ చేయాల్సిన సీనరేజీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ఎందుకు మళ్ళిస్తుందని ప్రశ్నించారు. చేశారు. 12ఏళ్ల క్రితం చైనాకు ఎగుమతి చేసిన గ్రానైట్ విషయంలో రూ.125కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను చేసిన ఫిర్యాదు  మేరకే కరీంనగర్ లోని గ్రానైట్ సంస్థలపై ఈడీ విచారణ జరుగుతోందని చెప్పారు. 

ట్రాక్టర్​ ఎక్కి పొలం దున్నిన బండి సంజయ్​

కోరుట్ల రూరల్, వెలుగు: ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. బండి సంజయ్ కు వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర సందర్భంగా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ సమీపంలో బండి సంజయ్ ట్రాక్టర్​ఎక్కి ఓ రైతు పొలంలో దున్నారు. పాదయాత్రలో భార్గవిరెడ్డి అనే కార్యకర్త చాతిలో నొప్పి రావడంతో వెంటనే అంబులెన్స్ లో పాదయాత్ర క్యాంపుకు తరలించారు. ఆమెను బండి సంజయ్​పరామర్శించారు.  అనంతరం గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. తర్వాత గీత కార్మికుల  కోరిక మేరకు కల్లు రుచి చూశారు. పాదయాత్రలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపెల్లి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

గోపాల్​రావుపేటలో తైక్వాండో పోటీలు    

రామడుగు, వెలుగు: రామడుగు మండలం గోపాల్​రావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హైస్కూల్​లో శనివారం తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సత్తాచాటిన 12 మంది విద్యార్థులకు ఎల్లో బెల్ట్, 14 మంది విద్యార్థులకు ఎల్లో 1 బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో తైక్వాండో కరీంనగర్​, జగిత్యాల జిల్లాల సెక్రటరీలు సంతోష్​, గంగారావు, స్కూల్​కరస్పాండెంట్ రాధాకృష్ణ, ప్రిన్సిపల్ వెంకటనారాయణరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మునీందర్ రెడ్డి, పాల్గొన్నారు.

డీఎస్పీ ఆఫీస్ ఎదుట బీఎస్పీ లీడర్ల ధర్నా

మెట్ పల్లి, వెలుగు: బీఎస్పీ లీడర్​పై దాడిచేసిన టీఆర్ఎస్ నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్​చేస్తూ ఆ పార్టీ లీడర్లు మెట్​పల్లి డీఎస్పీ ఆఫీస్​ఎదుట ధర్నా చేపట్టారు. బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల బీఎస్పీ నాయకుడు  బొబ్బిలి గోపిపై టీఆర్ఎస్ లీడర్లు బట్టు శేఖర్, బత్తుల నరేశ్,  భరత్, విపుల్ తో పాటు అనుచరులు  30 మంది అనుచరులు అకారణంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ దందాలకు పాల్పడుతూ అమాయకులపై దాడులు చేస్తున్న వీరిని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు..  టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్​చేశారు. అనంతరం బాధితుడికి న్యాయం చేయాలని డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఎస్పీ లీడర్లు బత్తుల లక్ష్మణ్ , ప్రకాశ్, రాములు, ప్రభాకర్,  సంపత్,  రాథోడ్, నరేశ్​బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీధర్ పాల్గొన్నారు.

సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు : కాంగ్రెస్​ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన కాంగ్రెస్​ సీనియర్​ నేత, అది శ్రీనివాస్​ నియమితులయ్యారు. శ్రీనివాస్​ నియామకంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడుగా మక్కాన్​సింగ్​రాజ్​ఠాకూర్​ నియమితులయ్యారు. ఏఐసీసీ శనివారం ప్రకటించిన కార్యవర్గాల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన హర్కరవేణుగోపాల్​, పెద్దపల్లికి చెందిన సీహెచ్ విజయరమణారావులు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులు అయ్యారు. పెద్దపల్లి మాజీ డీసీసీ ఈర్ల కొమురయ్యను రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించారు.