ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
వెంకటాపురం, వెలుగు: ఏజెన్సీలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవలో సీఆర్పీఎఫ్ ముందంజలో ఉందని వెంకటాపురం సీఐ శివప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఆర్పీఎఫ్ ఎఫ్–39 బెటాలిన్ ఆధ్వర్యంలో ‘సివిక్ యాక్షన్ ప్రోగ్రాం’ నిర్వహించారు. మండల పరిధిలోని ఒంటిమామిడి, మల్లాపురం, కర్రివానిగుంపు, ముకునూరుపాలెం, దాన్వాయిపేట గిరిజన గ్రామాల్లోని సుమారు 200మంది ఆదివాసీలకు సోలార్ చార్జింగ్ ఎమెర్జెన్సీ లైట్స్, దోమతెరలను పంపిణీ చేశారు. సొంత శాలరీల నుంచి నిధులు వెచ్చించి ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు.

కామన్ రిక్రూట్ మెంట్ బోర్డుతో వర్సిటీలకు ప్రమాదం

ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ

కేయూ క్యాంపస్, వెలుగు: రాష్ట్రంలో కామన్​ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు వర్సిటీలకు ప్రమాదమని తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్​, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. అధ్యాపకులను నియమించేందుకు వైస్ ఛాన్స్ లర్లు, పాలక మండలి, వర్సిటీ డీన్స్​ఆఫ్​ ది డిపార్ట్​మెంట్స్, బోర్డ్ ఆఫ్​ స్టడీస్​ చైర్​ పర్సన్స్ కు ఉండే అధికారాన్ని రాజకీయ వ్యవస్థకు అప్పగించడం వర్సిటీల స్వయంప్రతిపత్తికి ప్రమాదమని అభిప్రాయపడ్డారు. కేయూ ఎస్ డీఎల్​సీఈ  వద్ద మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులకు ప్రైవేటు వర్సిటీలను ధారాదత్తం చేసి పేద ప్రజల విద్యార్థులపై పెనుభారాన్ని మోపుతున్నారని విమర్శించారు.

కార్పొరేట్​వర్సిటీలను ప్రోత్సహిస్తూ 70శాతం మంది నిరుపేదలకు విద్య, ఉద్యోగ ఉపాధి జీవనోపాదులను దూరం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో దాదాపు 2 వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రెగ్యులర్​ టీచర్లు లేక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం లేదన్నారు. టీచింగ్, నాన్​ టీచింగ్ స్టాఫ్​ను రిక్రూట్ చేయకుండా విద్యార్థులను రాజకీయ పార్టీల ప్రచారానికి ఉపయోగపడే కార్యకర్తలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలను  వాపసు తీసుకోకపోతే వర్సిటీలు మరింత భ్రష్టుపడతాయన్నారు. విద్యావ్యవస్థను కాపాడుకోవడానికి విద్యార్థి సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కేయూ విద్యార్థి నాయకులు గోవర్ధన్, వర్సిటీ పీడీఎస్​యూ అధ్యక్షుడు నాగరాజు,  బీసీ విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
 

నేడు, రేపు రామప్పలో అవగాహన సదస్సు

వెంకటాపూర్( రామప్ప), వెలుగు: ఈ నెల 9,10వ తేదీల్లో రామప్ప ఆలయ సమీపంలోని రైతు వేదికలో ‘2డే కెపాసిటీ బిల్డింగ్’ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు హెరిటేజ్ ట్రస్ట్ మెంబర్ ప్రొ. పాండురంగారావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రామప్ప ఆలయాన్ని ఎలా సంరక్షించుకోవాలి? ఇతరులకు ఎలా అవగాహన కల్పించాలనే అంశంపై అవేర్ నెస్ కల్పిస్తామన్నారు. అనుభవం ఉన్న వ్యక్తులతో సెమినార్లు నిర్వహిస్తామన్నారు. చీఫ్ గెస్ట్​గా కేయూ వీసీ టి.రమేశ్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య హాజరవుతారని వివరించారు. ఇదిలా ఉండగా.. చంద్ర గ్రహణం సందర్భంగా రామప్ప ఆలయాన్ని పూజారులు మూసి వేశారు. ఇయ్యాల ఉదయం 6గంటలకు తెరిచి, మహాసంప్రోక్షణ అనంతరం భక్తుల సందర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
 

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

పర్వతగిరి (ఐనవోలు), వెలుగు: రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​చెప్పారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అనంతరం ఐనవోలులో పలువురు లబ్ధిదారులు, బాధితులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు 
తదితరులున్నారు.

ఎంజేపీలో స్టూడెంట్ల కొట్లాట!

స్కూల్ నిర్వహణ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) బాయ్స్ హాస్టల్ లో స్టూడెంట్లు కొట్టుకున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు.. ఎనిమిదితో తరగతి విద్యార్థులపై దాడులు చేశారు. దీంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒళ్లంతా ఎర్రబారింది. ఈ విషయాన్ని ఆఫీసర్లు గోప్యంగా ఉంచారు. నాలుగైదు రోజుల తర్వాత పేరెంట్స్ కు చెప్పడంతో వారు ఇంటికి తీసుకెళ్లారు.

గాడి తప్పిన నిర్వహణ..

కమలాపూర్​ ఎంజేపీ స్కూల్ రోజురోజుకూ వివాదాస్పదంగా మారింది. స్టూడెంట్లను స్టాఫ్ పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో ఈ స్కూల్ లో సిగరేట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తాజాగా స్టూడెంట్ల గొడవలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ సిబ్బంది స్టూడెంట్లను చదివించడం, క్రమశిక్షణ నేర్పించడంలో ఫెయిల్ అయ్యారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇదేం స్కూల్ అంటూ.. వెళ్లిపోతున్నారు.

దివ్యాంగులకు ప్రత్యేక శిబిరం

జనగామ అర్బన్, వెలుగు: తెలంగాణ సమగ్ర శిక్ష, ఏఐఎల్ఎంసీఐ(ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఈ నెల 17న దివ్యాంగులకు ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ బి.నరసింహారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగామ పట్టణంలోని ప్రెస్టన్ గ్రౌండ్​లో ఈ ప్రోగ్రాం ఉంటుందన్నారు. దివ్యాంగులకు అవసరం అయ్యే ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన వారంతా ఆధార్ కార్డు, ఆదాయ సర్టిఫికేట్, రేషన్ కార్డు, సదరం సర్టిఫికేట్, రెండు ఫోటోలు వెంట తెచ్చుకోవాలన్నారు. సదరం సర్టిఫికేట్ లేని వారు డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని స్థానిక ప్రిన్సిపల్ ద్వారా ధ్రువీకరించి తీసుకురావాలన్నారు. 18ఏండ్లలోపు ఉన్న దివ్యాంగులు అర్హులని వివరించారు. మరింత సమాచారం కోసం 98851 59906 నంబర్ కు కాల్ చేయాలన్నారు.

ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్

జనగామ అర్బన్, రఘునాథపల్లి, వెలుగు: తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్​ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన పుప్పాల శ్రీకాంత్ నియామకం అయ్యారు. ఖమ్మంలో నిర్వహించిన ఆ సంఘం మహాసభల్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సంఘం రాష్ట్ర సభ్యుడిగా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన  పోదాల నాగరాజును ఎన్నుకున్నారు.

మినీ ట్యాంక్ బండ్​లకు మోక్షమెప్పుడో!  

  • ఏండ్లు గడిచినా పూర్తికాని పనులు

  • బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ ల నిర్మాణం అటకెక్కింది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ తరహాలో ప్రతీ నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్ బండ్ నిర్మించాలని 2016లో ప్రభుత్వం పనులు మొదలుపెట్టగా.. ఆరేండ్లు దాటినా పనులు పూర్తి కాలేదు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా వర్క్స్ కంప్లీట్ కాలేదు.

బిల్లులు రాక ఆగిన పనులు..

మహబూబాబాద్ నియోజకవర్గంలోని నిజాం, మైసమ్మ చెరువులు.. పాలకుర్తి సెగ్మెంట్​లోని తొర్రూరు పెద్ద చెరువు, డోర్నకల్ లోని మరిపెడ చెరువును మినీ ట్యాంక్ బండ్లుగా తయారు చేయాలని ఆఫీసర్లు భావించారు. ఇందులో భాగంగా పూడికతీత, కట్టను వెడల్పు చేయడం, తూములు, రివిట్మెంట్, బతుకమ్మ మెట్ల నిర్మాణం, మొక్కల పెంపకం, బోటింగ్, సుందరీకరణ పనులు మొదలు పెట్టారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. ఒక్కచోట కూడా పనులు పూర్తి స్థాయిలో జరగలేదు.

చర్యలు తీసుకుంటాం

మిషన్‌ ‌కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో ఐదు చెరువుల్లో మినీ ట్యాంక్​ బండ్లను అభివృద్ధి చేయాలని భావించాం. కొన్నిచోట్ల తరచూ ఎస్టిమేషన్ మారడం వల్ల పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. తొందరలో పెండింగ్​ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. - వెంకటేశ్వర్ రావు, ఇరిగేషన్ ఎస్ఈ, మహబూబాబాద్‌‌ జిల్లా