ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

గూడూరు, మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు  మహబూబాబాద్ జిల్లా గూడూరు తహసీల్దార్ ఒక్కొక్కరి నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నారని ఎన్టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ నాయక్ ఆరోపించారు. ఈమేరకు గురువారం అడిషనల్ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. నోటిఫికేషన్ల కోసం సర్టిఫికెట్లు అడిగితే.. యువత వద్ద వసూళ్లకు పాల్పడడం హేయమైన చర్య అని  మండిపడ్డారు.  ఫ్రీగా ఇవ్వాల్సిన వాటికి రూ.10వేల నుంచి రూ.30వేలు డిమాండ్ చేస్తున్నారని  పేర్కొన్నారు. ఆఫీసులో పైకం ముట్టనిదే పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్​ను వివరణ కోరగా.. కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేస్తున్నామన్నారు. ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదన్నారు.

ఈ– ఆఫీసులో వివరాలు నమోదు చేయాలి

ములుగు, ఏటూరునాగారం, వెలుగు: గ్రామ పంచాయతీ కార్యకలాపాలు ఈ–ఆఫీసులో నమోదు చేయాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆఫీసర్లకు సూచించారు. గురువారం మంగపేట మండలం రాజుపేట రైతువేదికలో ఐటీడీఏ పీవో అంకిత్​తో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. పంచాయతీ ఆదాయాన్ని, ఇండ్ల నిర్మాణ అనుమతుల వివరాలు జీపీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మండలంలో సాగుతున్న పోడు సర్వేపై ఆరా తీశారు. ప్రతి గ్రామంలో గ్రామ సబ నిర్వహించి, అర్హులందరికీ పట్టాలు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ తుల రవి, డీపీవో వెంకయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్ ఉన్నారు. అనంతరం మంగపేటలోని ప్రముఖ హేమాచలక్షేత్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

ములుగు, వెలుగు: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాం సింగ్ జీ పాటిల్ హామీ ఇచ్చారు. జిల్లాలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు గురువారం తన కార్యాలయంలో రూ.50వేల చొప్పున చెక్కులు అందజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అందే బెనిఫిట్స్, ఇతర అలవెన్స్ అందజేయాలని సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు సూచించారు.

ప్రధానిని అడ్డుకునేందుకు సీఎం కుట్ర

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణ రైతాంగానికి వరం

నర్సంపేట, వెలుగు: రాజకీయ దురుద్దేశంతోనే సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో చేతులు కలిపి ప్రధాని టూర్​ను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాడని బీజేపీ స్టేట్ లీడర్, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ఫైర్​అయ్యారు. నర్సంపేటలోని బీజేపీ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడం వల్ల కేంద్రంలోని బీజేపీకి మంచిపేరు వస్తుందనే ఉద్దేశంలోనే కేసీఆర్ కుతంత్రాలకు తెరలేపారని విమర్శించారు. కేసీఆర్ ఒక్క పరిశ్రమ అయినా పెట్టారా? అని విమర్శించారు.

బీజేపీ లీడర్ల ర్యాలీ..

ములుగు: రైతుల బాగు కోసం ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం పనిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్​రెడ్డి అన్నారు. గురువారం ములుగులోని జాతీయ రహదారిపై ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్​ప్రధాని టూర్​కు మద్దతుగా ర్యాలీ తీశారు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతోనే మోడీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతులపై భారం పడొద్దని రూ.3500 ధర ఉన్న యూరియా బస్తాను సబ్సిడీపై రూ.250కే కేంద్రం అందిస్తోందని చెప్పారు.

వ్యవసాయ మార్కెట్లకు రూ.కోటి 56లక్షలు

జనగామ, వెలుగు: జనగామ అగ్రికల్చర్  మార్కెట్ పరిధిలో నడుస్తున్న గోడౌన్లు, మార్కెట్ల అభివృద్ధికి అగ్రికల్చర్​, మార్కెటింగ్​శాఖ రూ.కోటి 56లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంతకాలంగా ఎదురుచూస్తున్న పనులకు మోక్షం లభించినట్లు అయింది. గురువారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  బాల్దె విజయ సిద్ధిలింగం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. యార్డు ఆవరణలో సీసీ కెమెరాల మెయింటనెన్స్, డ్రైనేజీల నిర్మాణానికి రూ.10 లక్షలు, రఘునాథపల్లిలోని నాబార్డు గోడౌన్ చుట్టూ కాంపౌండ్​వాల్ నిర్మాణానికి రూ.37లక్షలు, కుర్చపల్లి నాబార్డు గోడౌన్​ఆవరణలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40 లక్షలు, లింగాల ఘన్​పూర్​ మండలం నెల్లుట్లలోని నాబార్డు గోడౌన్​ చుట్టూ కాంపౌండ్​ వాల్​ నిర్మాణానికి రూ.30 లక్షలు, అదే గోడౌన్​ఆవరణలో సీసీ రోడ్ల నిర్మాణానికి మరో రూ.39 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ పనులు త్వరలోనే చేపట్టి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయాల అభివృద్ధికి కృషి

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. గురువారం ఈవో భారతి అధ్యక్షతన కొత్త ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరగగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలి కొత్త చైర్మన్ దువ్వ నవీన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెట్టుగుట్ట ఆలయంలో రూ.6.98కోట్లతో రాజగోపురాలు, ప్రహరీ గోడ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ సాగుతోందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన భూమిని పూర్తిగా ఆలయాభివృద్ధికే వినియోగిస్తామని వివరించారు.

మసీదుల అభివృద్ధికి రూ.6కోట్లు

వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలో మసీదుల అభివృద్ధికి రూ.6కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్​చెప్పారు. గురువారం ఆయన పట్టణంలో 8.35లక్షలతో నిర్మించే మసీదు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ మసీద్ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని మైనార్టీ నాయకులు కోరడంతో  అదనగా మరో రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సైబర్ క్రైమ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.

కొనుగోలు కేంద్రాలు షురూ..

ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ నిమ్మ కవిత, తహసీల్దార్ రజిని, ఎంపీడీవో జోహార్ రెడ్డి తదితరులున్నారు.

త్వరలో ప్రెస్ క్లబ్ నిర్మాణం

వరంగల్ సిటీ: వరంగల్ తూర్పులో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం వరంగల్ కాశిబుగ్గలోని జర్నలిస్టు పరపతి సంఘం భవనం మీద మరో అంతస్తు నిర్మాణానికి రూ.69 లక్షలతో పనులు ప్రారంభించారు. నియోజకవర్గంలో త్వరలోనే జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కొత్త ప్రెస్ క్లబ్ కు స్థలం కూడా రెడీగా ఉందని, త్వరలోనే భూమి పూజ చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.

నాణ్యమైన భోజనం పెట్టాలి

లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటం

మరిపెడ, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీబీసీడీవో శ్రీనివాస్ రావు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని బీసీ వసతి గృహంలో స్టూడెంట్ల సమస్యలపై ఎస్ఎఫ్ఐ లీడర్లను చేస్తున్న ధర్నాకు ఆయన స్పందించారు. గురువారం స్కూల్​ను విజిట్ చేసి స్టూడెంట్లతో మాట్లాడారు. స్కూల్​లో టాయిలెట్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మెనా ప్రకారం పిల్లలకు భోజనం పెట్టకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. హాస్టల్​నిర్వహణలో ఎలాంటి తప్పులు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. కాగా, హాస్టల్​లో 80మందికి గాను 20మంది మాత్రమే ఉండడం పట్ల డీబీసీడీవో విస్మయం చెందారు.

రెండో విడతలో 185మందికి దళిత బంధు

జనగామ అర్బన్, వెలుగు: దళితబంధు లబ్ధిదారులు లాభం ఉన్న యూనిట్లనే ఎంపిక చేసుకోవాలని జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్​లో దళితబంధుపై స్పెషల్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. రెండో విడతలో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 185 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. పాలకుర్తికి 50, జనగామకు 60, స్టేషన్ ఘన్​పూర్ 75 యూనిట్లు సాంక్షన్ అయ్యాయన్నారు. ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులకు లాభదాయక యూనిట్లపై అవేర్ నెస్ కల్పించాలన్నారు. అలా అయితేనే నష్టపోకుండా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మధుమోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకన్న, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, జడ్పీ సీఈవో వసంత 
తదితరులున్నారు.

పీఏసీఎస్ చైర్మన్ సస్పెన్షన్

మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలకేంద్రం తాడిచెర్ల సహకార సంఘం సొసైటీ చైర్మన్ చెప్యాల రామారావును సస్పెండ్ చేస్తూ సహకార సంఘం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్​చార్జి చైర్మన్ గా మల్కా సూర్య ప్రకాశ్​రావును నియమించారు. ఈమేరకు గురువారం తాడిచెర్ల సహకార సంఘం పాలకవర్గం ఎంసీ మీటింగ్ లో మల్క సూర్య ప్రకాశ్​రావు బాధ్యతలు స్వీకరించారు.

అసలేం జరిగిందంటే..!

తాడిచెర్ల ప్రాథమిక సహకార సంఘం సొసైటీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆఫీసర్లు 51వ విచారణ చేపట్టారు. 2016 నుంచి 2021వరకు జరిగిన కార్యకలాపాలను చెక్ చేశారు. ధాన్యానికి చెందిన రూ.50 లక్షలు, ఎరువులకు సంబంధించిన రూ. 35 లక్షల డబ్బు పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. చైర్మన్ తో పాటు ఎరువుల బస్తాల విక్రయం, రైతుల ధాన్యం డబ్బులను వ్యక్తి గత ఖాతాలోకి జమ చేసుకున్న 
మాజీ సీఈఓ శ్రీకాంత్ ని విధుల నుంచి తొలగించాలని, ట్యాబ్ ఆపరేటర్ రవి, సిబ్బంది కిరణ్, అంకూస్ లను సస్పెండ్ చేయాలని ఎంక్వైరీ ఆఫీసర్ ఆదేశించారు. చైర్మన్ పై తదుపరి
చర్యలకు డీసీఓకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలియజేశారు.

సేవాభావంతో పనిచేయాలి

ములుగు, వెలుగు: స్టాఫ్ నర్సులు సేవాభావంతో పనిచేయాలని డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి సత్యేంద్రనాథ్ సూచించారు. గురువారం ములుగులో జిల్లాకేంద్రంలో స్టాఫ్ నర్సులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. జిల్లాలో అసంక్రమిత వ్యాధిగ్రస్తులు, ట్రీట్​మెంట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్​లైన్ లో నమోదు చేయాలన్నారు. రోగ నిర్ధారణను సక్రమంగా నిర్వహించాలన్నారు. రోగులకు మందులు ఎప్పటికప్పుడు అందించాలన్నారు.