అధికారంలోకి వస్తే పథకాలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటాం: రఘునాథ్ యాదవ్

అధికారంలోకి వస్తే  పథకాలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటాం:  రఘునాథ్ యాదవ్

చందానగర్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకుడు  రఘునాథ్ యాదవ్ తెలిపారు. సోమవారం  మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, లక్ష్మీ నగర్, ఓంకార్ నగర్ తదితర కాలనీలు, బస్తీల్లో ‘గడప గడపకు రఘన్న’ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి ప్రతి ఇంటికి తిరుగుతూ వివరించారు. 

ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ... జనాలకు ఇచ్చిన హామీలను విస్మరించే నాయకులను పట్టించుకోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ చెప్పిన నేతలు అదే మాటలను ఎన్నికల సమయంలో ఓట్లను అడిగేటప్పుడు చెప్పాలన్నారు. ఎన్ని ఇండ్లకు ఉద్యోగాలు ఇచ్చారో..  దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఎంతమందికి దక్కాయో శ్వేతపత్రం విడుదల చేయాలని రఘునాథ్​ డిమాండ్ చేశారు.

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏ మొహం పెట్టుకుని డివిజన్, కాలనీలు, బస్తీల్లో ప్రచారానికి వస్తారని ఆయన నిలదీశారు. శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, మహిళలు, పార్టీ అభిమానులు ఉన్నారు.