పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి తన అద్భుతమైన కథలతో వార్తల్లో నిలిచారు. బేసిక్ సెన్స్ ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమయ్యే పచ్చి అబద్ధాలను ఆయన అంతర్జాతీయ వేదికపై ఎంత ధీమాగా చెప్పారంటే.. బహుశా ఆయన మాటలు వింటే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు కూడా బిత్తరపోవాల్సిందే. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ వాడిన యుద్ధ సామాగ్రి తమ టెక్నాలజీనే అంటూ డొల్ల కథలు చెప్పారు మునీర్. ఇది విన్న అంతర్జాతీయ మీడియా సాక్ష్యాలు లేకుండా సొల్లు ఎందుకు చెబుతున్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
లిబియా నేషనల్ ఆర్మీకి తమ 'JF-17' యుద్ధ విమానాలను అమ్ముకునే క్రమంలో మునీర్ ఈ స్కెచ్ వేశారు. భారత్‌తో జరిగిన యుద్ధంలో తాము 90 శాతం స్వదేశీ టెక్నాలజీనే వాడాం. ఆ టెక్నాలజీతో భారత వాయుసేనకు చెందిన రఫేల్, సుఖోయ్-30, మిగ్-29, మిరాజ్-2000 విమానాలతో పాటు అధునాతన S-400 డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా కూల్చేశాం అంటూ చెప్పటం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులపాలవుతున్నాయి.
మునీర్ 'యుద్ధ వీరగాథ'లో అసలు లాజిక్ ఎక్కడా కనిపించదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఒక్క రఫేల్‌ను కానీ, S-400ను కానీ కోల్పోయినట్లు ప్రపంచంలో ఏ ఒక్క క్రెడిబుల్ డిఫెన్స్ ఏజెన్సీ గానీ, శాటిలైట్ చిత్రాలు గానీ ధృవీకరించలేదు. పాకిస్థాన్ చూపించిన విమాన శకలాలు కూడా పాతవని, అవి రఫేల్‌వి కావని ఫ్రెంచ్ నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. భారత్‌కు చెందిన 'PIB ఫ్యాక్ట్ చెక్' విభాగం కూడా పాక్ ప్రచారం చేస్తున్నవన్నీ ఫేక్ ఫోటోలని ఆధారాలతో సహా బయటపెట్టింది.
►ALSO READ | లాస్ ఏంజిల్స్‌లో ఘోర కారు ప్రమాదం: కాల్ ఆఫ్ డ్యూటీ సృష్టికర్త విన్స్ జాంపెల్లా మృతి...
మునీర్ 90 శాతం స్వదేశీ టెక్నాలజీ అని గొప్పగా చెప్పుకున్నారు కానీ.. యుద్ధ క్షేత్రంలో దొరికిన మిస్సైళ్లు, డ్రోన్లు, రాడార్ల మీద స్పష్టంగా 'మేడ్ ఇన్ చైనా' అని రాసి ఉంది. మునీర్ అమ్ముకోవాలని చూస్తున్న JF-17 విమానం కూడా చైనా-పాక్ ఉమ్మడి ప్రాజెక్ట్. అందులో కీలకమైన ఇంజిన్ నుంచి రాడార్ దాకా అన్నీ విదేశీవే. అంటే మిడిన్ పాక్ పరికరాలు పూర్తిగా ఒక కథ అని ఇది స్పష్టం చేస్తోంది.
భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్. సింగ్ చెప్పినట్లుగా.. "పాకిస్థాన్ దగ్గర ఉన్న ఆయుధాల్లో 81 శాతం చైనావే." నిజానికి చైనా తన ఆయుధాలను టెస్ట్ చేసుకోవడానికి పాకిస్థాన్‌ను ఒక 'లైవ్ ల్యాబ్'లా వాడుకుంటోంది. ఈ చేదు నిజం మునీర్ తెలియనిది కాదు, కానీ అబద్ధం చెప్పకపోతే ఆయుధాలు అమ్ముడుపోవని ఆవేదన కావొచ్చని తెలుస్తోంది.
తమ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా, అంతర్జాతీయంగా పరువు పోతున్నా.. పాక్ ఆర్మీ మాత్రం అబద్ధాలనే పెట్టుబడిగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తోందని మరోసారి ఇది రుజువు చేసింది. చైనా వస్తువులపై 'పాకిస్థాన్ టెక్నాలజీ' అని స్టిక్కర్లు వేసి, భారత్ లాంటి అగ్రగామి దేశంపై గెలిచేశామంటూ మాటలు చెప్పడం మునీర్ తెలివితక్కువ తనాన్ని బయటపెడుతోంది. వాస్తవానికి పాక్ సైనిక నాయకత్వం ఇప్పుడు సాక్ష్యాలు లేని ప్రచారాన్ని, వాస్తవాలతో సంబంధం లేని ధైర్యాన్ని నమ్ముకుని కాలం వెళ్లదీస్తోంది. మెుత్తానికి లిబియాలో ఆయుధాలు అమ్ముకోవడానికి మునీర్ చెబుతున్న ఈ 'రఫేల్' కథ వింటే.. "అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి" అనే సామెత గుర్తుకొస్తోంది.
