రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా: రేవంత్ రెడ్డి

రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా: రేవంత్ రెడ్డి
  •  కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం 
  • ఢిల్లీలో ఆమె నివాసంలో కలిసి ఇన్విటేషన్ 
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, లోక్ సభ ఎన్నికలు, తదితర అంశాలపై చర్చ 
  • రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాను ఆహ్వానించామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని ఆహ్వానించినట్లు సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సోనియా రాక కోసం రాష్ట్ర ప్రజలతో పాటు, తామంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో సోనియా గాంధీ చూపిన చొరవ, కృషి పట్ల ప్రజలలో ఎంతో అభిమానం, ఆదరణ ఉందన్నారు. 

మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో రేవంత్ కలిశారు. రాష్ట్ర అవతరణ వేడులకు చీఫ్ గెస్ట్​గా రావాలని ఆహ్వానించారు. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానం గురించి తెలిపారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, తాజా లోక్​సభ ఎన్నికలు, ఇతర అంశాలపైనా ఈ సందర్భంగా వారు చర్చించారు. సోనియాతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఆహ్వానించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజల తరఫున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించినట్లు చెప్పారు. వేడుకలకు వచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిపారు. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. జూన్​ 2 తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని.. వేడుకలను అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

 తమ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పుకున్నందుకు సోనియాగాంధీకి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఆ జాబితాను తయారు చేసే బాధ్యతను ప్రొఫెసర్ కోదండరాంపై పెట్టామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం దక్కుతుందన్నారు. ఇవి ప్రజాపాలనలో జరుగుతున్న మొదటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలన్నారు.   

బీజేపీకి పాక్ కాకుండా ఇంకేం గుర్తొస్తది? 

దేశంలో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీకి పాకిస్తాన్ గుర్తుకొస్తుందని సీఎం రేవంత్ చురకలంటించారు. పాక్‌‌‌‌ ప్రధాని పుట్టిన రోజు వేడుకలకు ఎవరు వెళ్లారో దేశ ప్రజలకు తెలున్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, వంటి అంశాలను లేవనెత్తితే బీజేపీకి పాకిస్తాన్ కాక ఇంకేం గుర్తుకు వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు.