కమండల్ టు మండల్ బీజేపీ వ్యూహం

కమండల్ టు మండల్ బీజేపీ వ్యూహం

తన రాజకీయ ఎజెండాలో  అతి ప్రధానమైన అయోధ్య రామమందిర అంశం చిట్టచివరికి నెరవేరడంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది . అయోధ్య విషయంలో అనేక వివాదాలు, విమర్శలు మూటగట్టుకున్న  బీజేపీ తాజాగా అయోధ్య అంశానికి శుభం కార్డు పడి 24 గంటలు గడవకముందే.. బిహార్​లో ప్రజాదరణ ఉన్న బడుగుల నేత కర్పూరీ ఠాకూర్​కు భారతరత్న ప్రకటించడం గమనార్హం. ఇది వేగంగా బిహార్​ రాజకీయ సమీకరణలనూ మార్చేయగలిగింది. ఇండియా కూటమిని నుంచి బిహార్​ ముఖ్యమంత్రి నితిశ్​కుమార్​ను తిరిగి తన వైపు బీజేపీ లాక్కోగలగడం కొసమెరుపు. ఏది ఏమైనా కర్పూరీ ఠాకూర్​కు భారతరత్న, నితీశ్​కుమార్​ తిరిగి ఎన్డీఏలో చేరడంతో బీజేపీ తన బీసీ కార్డును మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నమేగాకుండా, ఇండియా కూటమిని  బలహీన పర్చగలిగామనేదే మోదీ అసలు వ్యూహం అయిఉంటుంది.

హిందూత్వ ఎజెండాతో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ, కాలానుగుణంగా తన సిద్ధాంతాలలో మార్పు చేసుకుంటూ వస్తున్నది.  డెబ్బై, ఎనభైవ దశకంలో ఇద్దరు ఎంపీలతో ఉన్న ఆ  పార్టీ, అయోధ్య  విషయంలో జోక్యం చేసుకుని 87 సీట్లకు చేరింది. ఆపార్టీ రాముడిని రాజకీయ ఆయుధంగా మార్చుకొని అద్వానీ రథయాత్ర ద్వారా దేశంలోని హిందువులకు తామే ప్రతినిధులం అని వాజ్​పేయి ప్రభుత్వ ఏర్పాటు ద్వారా నిరూపించుకున్నారు. ఒకనాడు మండల్  కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని పెద్ద ఉద్యమం నడిచిన సందర్భంలో  బీజేపీ రామ్ మందిర్  అంశాన్ని తీసుకురావడంతో  మండల్ వర్సెస్ కమండల్​గా మారిన పరిస్థితిని ఆ పార్టీ అనతికాలంలోనే అధిగమించింది. 

మండల్​, కమండల్​ ఉద్యమాలు

వాస్తవానికి మండల్, ​కమండల్ రెండు ఉద్యమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నది బీసీ వర్గాలే. ముఖ్యంగా ఉత్తరాదిన జోరుగా సాగిన ఈ ఉద్యమాలు దీనిలో  చాలామంది నాయకులు ఎదిగివచ్చారు. ముఖ్యంగా జనతాదళ్ బలమైన రాజకీయ పక్షంగా ఎదిగింది. బీజేపీ హిందూత్వ ఛాంపియన్​గా బలపడింది.  ఆ ఉద్యమాల్లో బీజేపీ చాలా గుణపాఠాలనే నేర్చుకుంది. ముఖ్యంగా బీజేపీకి తాత్విక చింతన అందించే సంఘ్ పరివార్ భవిష్యత్ రాజకీయ  ముఖచిత్రాన్ని అంచనా వేయగలిగింది. హిందూత్వ ఎజెండాతో ఎంతోకాలం భారత్​లాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో  రాజకీయంగా  మనలేమని అంచనా వేసింది. సామాజిక న్యాయం సూత్రాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా హిందూత్వ సోషల్ జస్టిస్ అనే వ్యూహంతో జమిలిగా నూతన సూత్రీకరణను భారత సమాజం ముందు పెట్టింది. వాజ్​పేయి ప్రధాని కాగానే  మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎన్నుకొని బాబ్రి ఘటనతో హృదయ గాయంలో ఉన్న మైనార్టీలకు ఊరట సందేశం ఇవ్వగలిగింది. 

కాలానుగుణంగా..

 సిద్ధాంతం ఆధారంగా పనిచేసే బీజేపీలాంటి పార్టీలో వ్యక్తుల తాలూకు ప్రభావం కంటే  సిద్ధాంత మథనం  తోనే నిర్ణయాలు జరుగుతుంటాయి. మోదీ ఆలోచన సరళిపై పరివార క్షేత్రంలో చర్చ లేకుండా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు అనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా నాగపూర్ ఆమోదం లేనిదే మార్పు సాధ్యం కాదు. మోదీ  ప్రధానిగా పదవి చేపట్టగానే బీసీ కమిషన్​కు జాతీయ రాజ్యాంగ హోదా ఇవ్వడం, ఉన్నత విద్యా సంస్థల్లో  బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలాంటి నిర్ణయాలతో బీసీ వర్గాలకు  దగ్గరయ్యే ప్రయత్నం జరిగింది. రెండవసారి ప్రధాని బాధ్యతలు తీసుకోగానే  దేశ చరిత్రలో మొట్ట మొదటిసారి 27 మంది ఓబీసీలను క్యాబినెట్​లోకి తీసుకొని సంచలనం సృష్టించారు. హైదరాబాద్. సెంట్రల్ యూనివర్సిటీ  వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనతో దేశవ్యాప్తంగా  హిందూత్వ శక్తులపై వ్యతిరేక ప్రచారం మొదలు కావడంతో  రామ్​నాథ్ కోవింద్​ను రాష్ట్రపతిగా నియమించి తమది దళిత అనుకూల విధానం అని సందేశం పంపే ప్రయత్నం చేశారు. దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న మతమార్పిడిలు, మరోవైపు నక్సల్ ఉద్యమ ప్రభావం ఆదివాసీ ప్రాంతాల్లోనే ఎక్కువ కావడం గమనించి,  ఆదివాసీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. 

ఓబీసీ మంత్రం

దేశంలో బిహార్​ పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. యూపీలాగానే, బిహార్​లోనూ కుల సమీకరణలే జయాపజయాలను నిర్ణయిస్తుంటాయి. మోదీ కరిష్మా ఎంత పనిచేసినా అది గెలుపు తీరాలకు చేరుస్తుందనే పూర్తి నమ్మకం లేదు. కాబట్టి మోదీ కరిష్మాకు, ఒక కర్పూరీ ఠాకూర్​ ఒక నితీశ్​కుమార్​ను జోడిస్తే గెలుపునకు తిరుగుఉండకపోవచ్చనే అంచనా మోదీకి ఉండి ఉంటుంది. కాబట్టే బిహార్​ రాజకీయ ముఖచిత్రంలో శరవేగంగా  మార్పులు జరిగాయనే చెప్పాలి.  హిందూత్వ పార్టీగానే ఎప్పటికీ నడపడం సాధ్యం కాదు. దానికి ఓబీసీ కార్డు తోడైతేనే  విజయాలకు ఢోకా ఉండదనే వ్యూహానికి బీజేపీ పదును పెడుతున్నదని చెప్పొచ్చు.  మధ్య ప్రదేశ్ సీఎం పదవి బీసీకి ఇవ్వడం, రాజస్థాన్ ఉపముఖ్యమంత్రిగా బీసీని చేయడం బీజేపీ మారుతున్న పంథాను సూచిస్తుంది.  

బీసీ రూపంలో మోదీ..

దేశ ప్రధానులుగా  ఎక్కువ  బ్రాహ్మణ వర్గం నుంచి ప్రాతినిథ్యం ఉండటంతో ఇతర వర్గాలకు చోటు లభించడంలేదన్న  చర్చ ఉండేది.  మోదీ రూపంలో  బీసీ ప్రధాని అభ్యర్థి లభించడం, బీజేపీ భారీ విజయాన్ని అందుకోవడం ఒక పరిణామం. వాజపేయి, అద్వానీ వరకు హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీని పూర్తి స్థాయిలో  అన్ని వర్గాల పార్టీగా మలిచే కృషి మాత్రం మోదీ జమానాలో రూపుదిద్దుకుంది. అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠనూ మోదీయే జరపడం ద్వారా బీసీ రాజకీయానికి హిందుత్వాన్ని జోడించే ప్రయత్నం చేశారు. 

-  దొమ్మాట వెంకటేశ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్