బాబుకు పసుపు రాసి.. జగన్‌కు తిలకం దిద్దారు : పృథ్వీరాజ్

బాబుకు పసుపు రాసి.. జగన్‌కు తిలకం దిద్దారు : పృథ్వీరాజ్

ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టినప్పుడే వైఎస్ జగన్ సీఎంగా గెలిచారని అన్నారు వైసీపీ పార్టీ నాయకుడు, సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్. హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ఆయన ఈ ఉదయం మాట్లాడారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి జనాల కష్టాలు విన్నారు కాబట్టే ఆయనకు అఖండ విజయం దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలిసిన ఏకైక నాయకుడు జగనే అన్నారు. ఆనాడు నందమూరి తారకరామారావు పార్టీ పెట్టినపుడు ఇచ్చిన తీర్పును… మళ్ళీ ఇన్నేళ్లకు ఇప్పుడు జగన్ కు జనం ఇచ్చారని అన్నారు.

జగన్ తన ఎన్నికల హామీ అయిన నవరత్నాల మీద తొలి సంతకం పెడతారని చెప్పారు పృథ్వీరాజ్. తామంతా పదవుల కోసం వైసీపీలోకి రాలేదని.. కార్యకర్తలాగా పనిచేశామని చెప్పారు. జనసేన నాయకులు వైసీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని విమర్శించారు.

పృథ్వీ మాట్లాడుతూ.. “రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన తరువాత ఉభయ గోదావరి జిల్లాలు రాజశేఖర్ రెడ్డికి మంచి మెజారిటీ ఇచ్చాయి. కులాల కోసం కాకుండా కాపులు కూడా వైసీపీకి ఓట్ వేశారు. కమెడియన్ లు ఈరోజు కింగ్ లు అయ్యారు. లగడపాటి నీకు చిలకను కొని ఇస్తాం… చిలక జోస్యం చెప్పుకో. మంత్రులు అంతా ఓడిపోతారు అని ముందే మేం చెప్పాం. మంగళగిరిలో లోకేశ్ రూ.వందకోట్లు పంచిపెట్టినా.. జనం మాత్రం వైసీపీ ఆర్కేను గెలిపించారు.  పసుపు కుంకుమ పథకం తో గెలుస్తామని టీడీపీ అనుకుంది.. కానీ.. జనం పసుపును బాబుకు రాసి.. వీరతిలకం జగన్ కు నుదుటన దిద్దారు. 30 ఇయర్స్ జగన్ సీఎంగా ఉంటారు” అన్నారు పృథ్వీరాజ్.

సినీ నటుడు కృష్ణుడు మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా జగన్ పాలన చేస్తాడన్నారు. ప్రమాణ స్వీకారానికి తామంతా వెళ్తామన్నారు. evm ట్యాంపరింగ్ చేస్తే చంద్రబాబు, బాలకృష్ణ ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.