రాములమ్మ ఝలక్..తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్​

 రాములమ్మ ఝలక్..తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్​
  •     సొంత పార్టీ నేతలే తాను బీజేపీకి దూరమవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్​
  •     సోనియా, రాహుల్​, కవితకు మద్దతుగా కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి వరుస ట్వీట్లతో ఇటు సొంత పార్టీలో, అటు బయట ఝలక్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతల తీరును ట్విట్టర్ వేదికగా తప్పుపడుతుండటం.. మరికొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీ నేతలకు అనుకూలంగా ట్వీట్లు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నది. కాంగ్రెస్  అగ్ర నేత సోనియా గాంధీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆమెకు ఆడబిడ్డగా అండగా ఉంటానని ట్విట్టర్​లో పేర్కొనడం, మరో సందర్భంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ట్వీట్​ చేయడం.. వంటివన్నీ పొలిటికల్ గా హీట్ ను పెంచుతున్నాయి. 

కిరణ్ ​కుమార్​ రెడ్డి వచ్చినప్పటి నుంచీ..!

రెండు నెలల కింద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఆ వేదికపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండడంతో రాములమ్మ.. అక్కడి నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఇది అప్పట్లో రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశమైంది. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తితో తాను వేదిక పంచుకోలేకనే అక్కడి నుంచి బయటకు వచ్చానని ఆ తర్వాత విజయశాంతి ట్వీట్​ చేశారు. అప్పటి నుంచి ఆమె వరుసగా చేస్తున్న  ట్వీట్లు ఇటు బీజేపీలోనే కాదు అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

సొంత పార్టీ నేతలపై ఫైర్​

తాజాగా విజయశాంతి గురువారం సొంత పార్టీ నేతలపైనే చేసిన ట్వీట్ బీజేపీలో కాక పుట్టించింది. ‘‘మా పార్టీలోని కొంత మంది నేతలే పనిగట్టుకొని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్న” అని ట్వీట్​లో విజయశాంతి పేర్కొన్నారు. పార్టీకి ఏది ముఖ్యమో ఆ విషయాలనే ఈ నెల 16 న జరిగిన ముఖ్య నేతల సమావేశంలో స్పష్టంగా చెప్పానని, ఆ విషయాలను బయటకు లీక్ చేయడం తనకు ఇష్టం లేదని, దానికి తాను వ్యతిరేకినని తెలిపారు. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో కొందరు నేతలు తాము అనుకున్నది బయటపెట్టేస్తారని, అలాంటి అలవాటు తనకు మాత్రం లేదంటూ సొంత పార్టీ నేతలపై ట్విట్టర్ వేదికగా రాములమ్మ ఫైర్​ అయ్యారు. 

సోనియా, రాహుల్​కు మద్దతుగా..!

ఇటీవల కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన సోని యాగాంధీని ప్రశంసిస్తూ రాములమ్మ ట్వీట్ చేశారు. ‘‘రాజకీయాలు ఎలా ఉన్నా.. రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతో చూస్తాం.. రాజకీయా లకు అతీతంగా ఆమెను గౌరవిస్తాం” అని అందులో పేర్కొన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటేనని తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్  సభలో రాహుల్ గాం ధీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ విజ యశాంతి ట్వీట్ చేశారు. ‘‘ఎంఐఎం, బీఆర్ఎస్  ఒక్కటేనని నేను ఎప్పటి నుంచో అంటున్న మాటలనే ఇప్పుడు రాహుల్ చెప్పడం సమంజసమే” అని అందులో పేర్కొన్నారు. 

కవితకు ఈడీ నోటీసులిచ్చినప్పుడూ..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంలో విజయ శాంతి  ఓ ట్వీట్ చేశారు. ‘‘ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు.. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషిగానే ఎప్పుడూ నిలువాలని వ్యక్తిగతంగా రాములమ్మ కోరుకుంటుం ది’’ అని అందులో ఆమె పేర్కొన్నారు. మరో సందర్భంలో తెలంగాణను కాంగ్రెస్ ఇయ్య లేదని మంత్రి హరీశ్​రావు విమర్శిస్తే.. దీన్ని తప్పుపడుతూ ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసింది ముమ్మాటికి నిజమని అందులో పేర్కొన్నారు. ఇలా ఆమె చేస్తున్న ట్వీట్లు ఇటు బీజేపీలో .. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చర్చకు దారితీస్తున్నాయి.