
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ కోసం నిర్ణయించిన దరఖాస్తు ఫీజుపై విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్ల ఫీజు పెంచడాన్ని పేరెంట్స్ తప్పుబడుతున్నారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో అడ్మిషన్లతో పాటు..7–10 క్లాసుల్లో మిగిలిన సీట్లకు ఏప్రిల్ 16న అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు.
మంగళవారం అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అప్లికేషన్ ఫీజును పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ స్టూడెంట్లకు గతేడాది రూ. 75 ఉంటే ఈసారి రూ.125కి పెంచారు. ఓసీ స్టూడెంట్లకు రూ.150 నుంచి రూ.200లు చేశారు. కాగా, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు గతేడాది రూ.150 ఉంటే, ఈసారి దాన్ని రూ.125కు తగ్గించారు. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు తగ్గించినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజు కూడా తగ్గించాలని పేరెంట్స్ కోరుతున్నారు.