ఆర్టీసీ ఖాళీ జాగాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు.. ఆదాయం పెంచుకునే పనిలో యాజమాన్యం

ఆర్టీసీ ఖాళీ జాగాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు.. ఆదాయం పెంచుకునే పనిలో యాజమాన్యం
  • ఇప్పటికే నేషనల్ బిల్డింగ్ కన్​స్ట్రక్షన్ కంపెనీతో చర్చలు
  • లీజు గడువుపై స్పష్టత వస్తే.. త్వరలో ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: సొంతగా ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సంస్థకు ఉన్న ఖాళీ స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ, నిర్మాణరంగంలో సేవలందిస్తున్న నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌‌బీసీసీ)కి ఈ ఖాళీ స్థలాలను అప్పగించి అందులో కమర్షియల్ బిల్డింగ్​లను నిర్మించే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. 

ఈ స్థలాలను ఎన్‌‌బీసీసీకి 49 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చి కనీసం నెలకు రూ.50 కోట్ల వరకైనా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. అయితే, 99 ఏళ్ల పాటు తమకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనలను ఎన్‌‌బీసీసీ.. ఆర్టీసీ ముందు పెట్టినట్లు తెల్సింది. ఇటీవల ఈ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ కు వచ్చి ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. సిటీలోని మియాపూర్ బస్ బాడీ యూనిట్ స్థలాన్ని, ఉప్పల్ ఆర్టీసీ డిపోలోని ఖాళీ స్థలంతో పాటు బస్ భవన్ పక్కనున్న ఖాళీ జాగాను, కూకట్ పల్లి, రాజేంద్ర నగర్ లోని ఆర్టీసీ స్థలాలను కూడా ఈ ప్రతినిధులు పరిశీలించినట్లు తెల్సింది.

అయితే, మొదటి విడతలో మియాపూర్ బస్ బాడీ యూనిట్ కు చెందిన సుమారు 20 ఎకరాల స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఎన్‌‌బీసీసీ సంస్థ ఆసక్తి చూపినట్లు తెల్సింది. దీనిపై ప్రాథమికంగా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపిన ఎన్‌‌బీసీసీ... త్వరలో ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెల్సింది. అయితే లీజు గడువుపై రెండు సంస్థల మధ్య స్పష్టత రావాల్సి ఉంది. 

ఒకవేళ మియాపూర్ లోని బస్ బాడీ యూనిట్ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎన్‌‌బీసీసీ సంస్థ ముందుకొస్తే.. ఇక్కడ ఉన్న బస్ బాడీ యూనిట్ ను ఉప్పల్ లో ఉన్న ఆర్టీసీ డిపోకు లేదంటే కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్​కు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలనే పూర్తి స్థాయిలో తిప్పాలనే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం, ఇందులో భాగంగా మొదటి విడతలో కొన్ని బస్సులు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో బస్ బాడీ యూనిట్ సిటీకి అవసరం ఉండకపోవచ్చు. అందుకే ఆర్టీసీ యాజమాన్యం ఈ స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఎన్‌‌బీసీసీకి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెల్సింది. దీంతో ఆర్టీసీకి ఆర్థిక కష్టాలు తప్పే అవకాశం ఉంది.