దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్

దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్

కుత్బుల్లాపూర్: మహిళ మరణం కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూరారం పోలీస్ స్టేషన్ అడ్మిన్‌ ఎస్ఐ నారాయణసింగ్‌ పై సస్పెన్షన్‌ వేటుపడింది. జనవరిలో సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కేసును.. సరైన రీతిలో దర్యాప్తు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్‌ అవినాశ్‌ మహంతి అతన్ని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు.

2024 జనవరి 14న సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దుర్గాభవాని ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం వెలుగుచూసింది. అప్పటికే మరణించి రోజులు కావడంతో మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది.మృతదేహం పక్కన మద్యం సీసాలు,గ్లాసులు దొరికాయి. తొలుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేశారు. నెలలు గడిచినా ఇది హత్యా? లేక ఆత్మహత్యా?.. అసలు మరణానికి కారణాలేంటో మాత్రం తెలియలేదు. మృతురాలెవరో తేల్చేందుకు ఎంతో సమయం పట్టింది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి.దుర్గాభవాని ఆలయం సమీపంలో మహిళ మృతదేహం కనిపించిందంటూ కొందరు స్థానికులు బీట్‌ సిబ్బందికి సమాచారమిచ్చినా పట్టించుకోలేదని ఆరోపణ ఉంది.

ఈ సమాచారమిచ్చిన మూడ్రోజుల తర్వాత పోలీసులు మృతదేహం గుర్తించారు. అప్పటికే కుళ్లిపోవడంతో మృతదేహమెవరిదో గుర్తించడానికి వీల్లేకుండా మారింది. ఈ క్రమంలోనే తన భార్య కనిపించడం లేదంటూ సూరారం పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మృతదేహంపై ఉన్న కొన్ని గుర్తుల ఆధారంగా భర్త తన భార్యేనని చెప్పాడు. ఆ తర్వాత దర్యాప్తులోనూ కొంత నిర్లక్ష్యం జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఆమె మృతికి కారణమెంటో ఇప్పటివరకూ తేలలేదు. ఈ క్రమంలో కేసు పర్యవేక్షిస్తున్న ఎస్ఐ నారాయణసింగ్‌ ను బాధ్యుడిగా పరిగణించిన అధికారులు సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు.