డిసెంబర్ లో పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటాం : దేవాదాయ కమిషనర్ హరీశ్

 డిసెంబర్ లో పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటాం : దేవాదాయ కమిషనర్ హరీశ్
  • అధికారులకు దేవాదాయ కమిషనర్ ​హరీశ్​ వార్నింగ్
  • కాళేశ్వరం అభివృద్ధి పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్ 

మహదేవపూర్​/ గణపురం, వెలుగు: కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనుల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యంపై కమిషనర్​ హరీశ్​ సీరియస్ అయ్యారు. మంగళవారం కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.  పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే నెలలో మరోసారి వస్తానని, అప్పటిలోపు పనులు పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. 

అభివృద్ధి పనులపై షెడ్యూల్ రూపొందించాలని అధికారులకు సూచించారు. సరస్వతీ పుష్కరాల్లో చేపట్టిన ఆర్చ్ నిర్మాణం ఇంకా పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల నమ్మకానికి భంగం వాటిల్లకుండా నాణ్యతతో నిర్మించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. పనుల్లో వేగం, పారదర్శకత పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించనని స్పష్టం చేశారు. 

అనంతరం గణపురం మండలం చెల్పూర్​లోని కేటీపీపీని సందర్శించి విద్యుత్ ఉత్పత్తి తీరును పరిశీలించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.