
- ఓల్డ్ సిటీలో పర్యటించిన కమిషనర్ ఇలంబరితి
హైదరాబాద్ సిటీ, వెలుగు : యాకుత్ పురా డ్రైనేజీ నాలాపై సమగ్ర సర్వే చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తో కలిసి నియోజకవర్గంలోని పలు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లను పరిశీలించారు. రంగేలి కిడికి, హుస్సేన్ కోటి, మౌలానా చిల్ల, గంగా నగర్, రెయిన్ బజార్లలో పర్యటించారు. రంగేలి కిడికి ప్రాంతంలో మురుగు నీరు ఓవర్ ఫ్లోను చూసి అధికారులతో మాట్లడారు. నిజాం కాలం నాటి నాలాలపై పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
మౌలానా చిల్ల వద్ద గంగానగర్ నాలాను పరిశీలించారు. మూడేండ్లుగా పనులు పూర్తికాలేదని ఎమ్మెల్యే కమిషనర్ తో చెప్పారు. నిధుల సమస్య లేదని.. నిర్దేశించిన టైంలో వెంటనే పూర్తిచేయాలని కమిషనర్అధికారులను ఆదేశించారు. రెయిన్ బజార్ ఎగ్జిస్టింగ్ బాక్స్ డ్రెయిన్ లో వర్షపు నీరు వెళ్లక ఇండ్లలోకి చేరుతోందని కాలనీ వాసులు కమిషనర్ కు వివరించారు. బాక్స్ డ్రెయిన్ పనులు చేపట్టేందుకు రూ.1.60 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పనుల డీపీఆర్‌ను తనకు ఇవ్వాలని కమిషనర్ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు.