బదిలీపై వెళ్లాల్సిందే.. లేదంటే ఇంటికే: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తీరుపై కమిషనర్ సీరియస్

బదిలీపై వెళ్లాల్సిందే.. లేదంటే ఇంటికే: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తీరుపై కమిషనర్ సీరియస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు బదిలీ అయిన చోట విధుల్లో చేరకుండా జాప్యం చేస్తున్న తీరుపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్​లో హెచ్చరికలు జారీ చేస్తూ వెంటనే బదిలీ అయిన చోటకు జాయిన్ కావాలని వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో మొత్తం 500 మంది వరకు ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

ఈ నెల 3న జరిగిన బదిలీల్లో భాగంగా 220 మంది ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను (కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు) బదిలీ చేశారు. ట్రాన్స్​ఫర్ ఆదేశాలు వచ్చి వారంరోజులు గడిచినా కొందరు పాత స్థానాల నుంచి కదలకుండా ఉండడం, ఉత్తర్వులను బేఖాతరు చేయడం, గైర్హాజరవడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. 

కొందరు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఉద్యోగులను తమ వద్దే ఉంచుకోవాలని రికమండ్ చేయడంపై కూడా కమిషనర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఏ విభాగంలోనైనా ఇలాంటి ఉద్యోగులను తమ వద్దే ఉంచుకోవాలని సిఫార్సు చేసే అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు.