ప్రభుత్వ డిగ్రీ స్టూడెంట్లకు ఐసెట్ ఫ్రీ కోచింగ్..ప్రారంభించిన కమిషనర్ శ్రీదేవసేన

ప్రభుత్వ డిగ్రీ స్టూడెంట్లకు ఐసెట్ ఫ్రీ కోచింగ్..ప్రారంభించిన కమిషనర్ శ్రీదేవసేన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీలలో చదివే విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు కళాశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌‌లైన్ కోచింగ్ మాడ్యూల్‌‌ ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం కమిషనరేట్ ఆఫీసులో కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన డిజిటల్ మాడ్యూల్‌‌ను అధికారికంగా ప్రారంభించారు. ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన శిక్షణ అందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ ఉచిత శిక్షణ గురించి సర్కారు డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

డిజిటల్ మాడ్యూల్‌‌ను ఎలా వాడాలో వారికి వివరించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని వెల్లడించారు.కాగా, ఈ డిజిటల్ మాడ్యూల్ ద్వారా విద్యార్థులు ఇంటి వద్ద నుంచే పరీక్షకు ప్రిపేర్ అయ్యే వెసులుబాటు కల్పించారు. ఇందులో అపరిమితమైన ప్రాక్టీస్ సెషన్లు, పూర్తి స్థాయి గ్రాండ్ టెస్టులు, గత టీజీఐసెట్ ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. విద్యార్థులు తమ సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటు, టైమ్ మేనేజ్‌‌మెంట్ అలవాటు చేసుకునేలా  మాడ్యూల్‌‌ను రూపొందించారు. ఐసెట్ రాయబోయే విద్యార్థులందరూ https://ccets.info వెబ్‌‌సైట్ ద్వారా ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.