
- ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం
- రాచకొండ సీపీ సుధీర్ బాబు
మల్కాజిగిరి, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వాడకంతో పాటు విజిబుల్ పోలీసింగ్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ‘ విజిబుల్ పోలీసింగ్, సత్వర స్పందన, టెక్నాలజీ వాడకం’ వంటి మూడింటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల భాగస్వామ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఏరియాలోనూ బ్లూ కోల్ట్స్, పెట్రోకార్, సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ట్లు వివరించారు. నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కమిషరేట్ పరిధిలో విజిబుల్పోలీసింగ్పనితీరుపై వెల్లడించారు.
సైకిళ్లపై పెట్రోలింగ్
ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంచేందుకు డయల్100 , 112 ద్వారా వచ్చే కంప్లయింట్లపై పోలీసు ఉన్నతాధికారులు, బ్లూకోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని స్పష్టంచేశారు. బాధితుల వద్దకు వీలైనంత తక్కువ సమయంలో త్వరగా చేరుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు స్టేషన్ కు 3-5 సైకిళ్లను పంపిణీ చేశామని, శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానిక ఠాణా సిబ్బంది సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
మహిళా పోలీసుల భాగస్వామ్యం
ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంలో మహిళా పోలీసుల భాగస్వామ్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో విధుల నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. మహిళా సిబ్బంది కూడా ఉత్సాహంగా బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ డ్యూటీలు నిర్వహిస్తున్నారన్నారు. సైకిల్ పెట్రోలింగ్ ద్వారా కూడా ప్రజల్లో భరోసా పెంచుతున్నామన్నారు. ప్రత్యేక షీ- టీమ్స్ ద్వారా స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నామన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల పై నేరాలకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
డ్రగ్స్ సరఫరా పై ఉక్కుపాదం
డ్రగ్స్ సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపుతామని, అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్టు చేసి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేశామన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పని చేస్తామని, పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామన్నారు.