
ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు రకరకాల పరీక్షలు రాస్తూ వస్తున్న యువతకు ఓ గుడ్ న్యూస్. ఇకపై అలా అన్ని రకాల పరీక్షలు రాయకుండా ఆ ఉద్యోగాలన్నింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్ధికమంత్రి.. ఈ విషయాన్ని ప్రకటించారు, త్వరలోనే ఒకే పరీక్ష విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు.
నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీతో ప్రత్యేకమైన కామన్ టెస్ట్ నిర్ణయించేలా ప్రభుత్వం ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ప్రతి జిల్లాల్లో ప్రత్యేకించి అవసరమైన జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నిర్మల చెప్పారు. ఒకే సింగిల్ టెస్టు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంతో ఈజీగా ఉంటుందని అన్నారు.