
- క్రెడిట్స్ , గ్రేడింగ్ ,ఎగ్జామ్ సిస్టమ్ మొత్తం ఒకే రకం
- రాష్ర్ట డిగ్రీ విద్యా విధానంలో కీలక మార్పులు
- థర్డ్ ఇయర్‌లోనూ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్
- ఉన్నత విద్యామండలి నిర్ణయం
- 2019–20 నుంచే అమల్లోకి
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర డిగ్రీ విద్యావిధానంలో కీలక మార్పులు జరిగాయి. ఆరు యూనివర్సిటీల్లో కామన్ సిలబస్ ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో పాటు ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉన్న క్రెడిట్ పాయింట్లు, గ్రేడింగ్‌లతోపాటు పరీక్షల విధానాన్ని కూడా కామన్ చేయనున్నారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సీబీసీఎస్) విధానాన్ని పూర్తిగా అమలు చేయడంలో భాగంగా ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. 2019–20 విద్యాసంవత్సరం నుంచే మార్పులు అమల్లోకి రానున్నాయి.
యూజీసీ ఆదేశాలతో..
రాష్ర్టంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో సుమారు 1,151 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఏటా రెండున్నర లక్షల మంది చేరుతున్నారు. ఒక్కో యూనివర్సిటీ ఒక్కో సిలబస్‌ను తయారు చేసుకుని అమలు చేస్తోంది. క్రెడిట్స్, గ్రేడింగ్ విధానాలను కూడా వర్సిటీలు వేర్వేరుగా అమలు చేస్తున్నాయి. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులతోపాటు వివిధ ఉద్యోగాల సమయంలోనూ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కామన్ విధానంలోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి గతంలో పలుమార్లు వర్సిటీ వీసీలతో చర్చలు జరిపినా, అమలు కాలేదు. ఈనేపథ్యంలో కామన్ సిలబస్ తీసుకురావాలని రాష్ర్టాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆదేశాలిచ్చింది.
దీంతో సీబీసీఎస్ విధానంలో భాగంగా అన్ని సబ్జెక్టుల నిపుణులతో కమిటీలు వేసి, కామన్ సిలబస్‌ను ప్రభుత్వం రూపొందించింది. యూజీసీ ఆదేశాల మేరకు రాష్ర్టం రూపొందించిన సిలబస్‌ను వర్సిటీలు 80 శాతం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. మరో 20 శాతం సిలబస్‌ను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీ మార్చుకునే అవకాశముంది. అయితే అన్ని వర్సిటీల్లోనూ కామన్ సిలబస్ అమల్లోకి వస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
క్రెడిట్స్ 150కి తగ్గింపు
ప్రస్తుతం డిగ్రీ మూడేండ్ల కోర్సులకు 180 క్రెడిట్స్‌ను కొనసాగిస్తున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం 120 క్రెడిట్స్‌నే పెట్టుకోవాలి. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి 2019–20 విద్యా సంవత్సరం నుంచి క్రెడిట్స్‌ను180 నుంచి 150కి కుదించింది. భవిష్యత్‌లో మరిన్ని తగ్గించాలని భావిస్తోంది. ఒక్కో సెమిస్టర్ 90 రోజుల్లో పూర్తి కావాలని, 60 గంటల్లో సబ్జెక్ట్ నిలబస్ పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని వర్సిటీలకు సూచించింది. ఒక్కో సిలబస్‌కు 25 క్రెడిట్స్‌ను కేటాయించింది.
థర్డ్ ఇయర్‌లోనూ లాంగ్వేజీ సబ్జెక్ట్
ఇప్పటి వరకూ డిగ్రీ సెకండియర్ వరకే లాంగ్వేజీ సబ్జెక్టులండేవి. ఇక నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్‌లోనూ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను ఉన్నత విద్యా మండలి తప్పనిసరి చేసింది. ఆప్షనల్ సబ్జెక్టుల్లో భాగంగా ఏదైనా మరో సబ్జెక్ట్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, పార్శి, మరాఠీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల ఎక్స్‌పర్ట్స్‌తో సమావేశం నిర్వహించి, ఆయా సబ్జెక్టుల క్రెడిట్స్‌లోనూ మార్పులు చేసింది. 1, 2 సెమిస్టర్స్‌కు 4 క్రెడిట్స్, 3 నుంచి 6 సెమిస్టర్స్‌కు మూడు క్రెడిట్స్ చొప్పున కేటాయించనుంది. దీంతో లాంగ్వేజీ సబ్జెక్టుల క్రెడిట్స్ లో ఉన్న గందరగోళానికి తెరపడనుంది.