
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. అన్ని షూటింగ్ లు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో చిన్న నిర్మాతలు తమ కష్టాలను వివరిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఎస్కేఎన్, వంశీ నందిపాటి, బెన్నీ, అనురాగ్, చైతన్య, రాజేశ్ దండా, మధుర శ్రీధర్, శరత్ చంద్ర, ధీరజ్ వంటి పలువురు తమ ఆవేదనను వెల్లడించారు.
చిన్న నిర్మాతల ఆవేదన
చిన్న సినిమా నిర్మాతలు పడుతున్న కష్టాలు వేరని ఎస్కేఎన్ స్పష్టం చేశారు. సినిమా కార్మికులు 30 శాతం వేతనం పెంపు కోరుతున్నారు. అయితే మా సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు ఎవరు రప్పిస్తారు? మా సినిమా బడ్జెట్లకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక ప్రాతిపదిక లేకుండా అందరికీ వేతనాలు పెంచడం మాకు అసాధ్యం అని ఆయన అన్నారు. తాము పాన్ ఇండియా సినిమాలు నిర్మించడం లేదని, టికెట్ ధరల పెంపు లాంటివి తమకు వర్తించవని ఎస్కేఎన్ పేర్కొన్నారు.
అప్పులు చేసి సినిమాలు తీస్తున్నాం
యూనియన్ నిబంధనల వల్ల ఒక చిన్న సన్నివేశం కోసం కూడా అవసరం లేని 80 మందితో పని చేయించాల్సి వచ్చిందని మధుర శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదారుగురితో పూర్తయ్యే పనికి అంతమందిని ఎందుకు భరించాలి? నేను అనుకున్న బడ్జెట్‌లో, నాకు నచ్చిన కథను తీయలేకపోతున్నాను అని ఆయన అన్నారు. చిన్న నిర్మాతలు అప్పులు చేసి సినిమాలు తీస్తున్నారని, ఇప్పటికే ఎన్నో సమస్యల్లో ఉన్నారని ఆయన తెలిపారు.
ALSO READ : షాక్ ఇస్తున్న తారక్ వాచ్ ధర..
చిన్న సినిమాలు పరిశ్రమకు జీవనాడి వంటివని, అవి బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని రాజేశ్ దండా అన్నారు. డబ్బింగ్ సినిమాలు, ఓటీటీ విడుదల వంటి సమస్యలతో పాటు, యూనియన్ సభ్యులకు ఒక విధంగా, బయటివారికి మరో విధంగా చెల్లింపులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిర్మాతలకు నచ్చిన వారితో సినిమాలు ఎందుకు చేయకూడదని చైతన్య ప్రశ్నించారు. వేతనం పెంచాలా లేదా అనేది నిర్మాత ఇష్టం. కోవిడ్ తర్వాత లాభాలు ఆర్జించిన ఒక్క నిర్మాతనైనా చూపించగలరా? నిర్మాతలు ఎవరూ సంతోషంగా లేరు అని చైతన్య అన్నారు.
ఈ మొత్తం వివాదం చిన్న సినిమాల నిర్మాతల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోందని, ఈ సమస్యపై సినీ పరిశ్రమలోని పెద్దలు కూడా దృష్టి సారించాలని వారు కోరారు. లేకపోతే చిన్న సినిమాకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.