Ricky Ponting: పాంటింగ్ ఆల్ టైం టాప్-5 గ్రేటెస్ట్ బ్యాటర్స్ వీరే.. కోహ్లీని పక్కన పెట్టిన పంటర్

Ricky Ponting: పాంటింగ్ ఆల్ టైం టాప్-5 గ్రేటెస్ట్ బ్యాటర్స్ వీరే.. కోహ్లీని పక్కన పెట్టిన పంటర్

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా జట్టుకు రెండు వన్డే వరల్డ్ కప్ లు అందించడంతో పాటు.. రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఘనత పాంటింగ్ సొంతం. కెప్టెన్ గానే కాదు బ్యాటర్ గాను పాంటింగ్ రికార్డ్స్ అద్భుతం. టెస్ట్, వన్డే ఫార్మాట్ లో 13 వేలకు పైగా పరుగులు చేసిన అతి కొద్ధి మందిలో పాంటింగ్ ఒకడు. ఈ మాజీ ఆసీస్ కెప్టెన్ క్రికెట్ లో ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసే పాంటింగ్.. తాజాగా ఆల్ టైం ఐదుగురు బెస్ట్ క్రికెటర్ల పేర్లు చెప్పుకొచ్చాడు. పాంటింగ్ చెప్పిన ఐదు పేర్లలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

రికీ పాంటింగ్ టాప్-5 బెస్ట్ బ్యాటర్లలో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ తో పాటు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను చేర్చాడు. ప్రస్తుత ఆధునిక క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తో పాటు న్యూజిలాండ్ గ్రేటెస్ట్  కేన్ విలియంసన్ లను తన టాప్ -5 లిస్టులో చోటిచ్చాడు. తాను ఇప్పటివరకు ఆడిన వారిలో బ్రియాన్ లారా 'అత్యంత నైపుణ్యం కలిగిన' వ్యక్తి అని పాంటింగ్ చెప్పాడు. 

పాంటింగ్ మాట్లాడుతూ.. "నేను ఆడిన అత్యంత నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు, అతను నాకు అందరికంటే ఎక్కువ నిద్రలేని రాత్రులు మిగిల్చాడు.  టెక్నీకల్ గా సచిన్ తో పాటు రాహుల్ ద్రవిడ్‌ చాలా గొప్ప ఆటగాళ్లు. ఈ ముగ్గురితో పాటు ప్రస్తుత క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న రూట్, కేన్ విలియమ్సన్‌ను నా బెస్ట్ బ్యాటర్ల లిస్టులో ఉంటారు". అని ది టైమ్స్ తో పాంటింగ్ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్ కల్లిస్ తన ఆల్ టైం ఫేవరేట్ గా ప్రకటించాడు. 

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. తొలి ప్రయత్నంలోనే జట్టును ఫైనల్ కు చేర్చాడు. అంతకముందు పాంటింగ్ శిక్షణలో ఢిల్లీ క్యాపిటల్స్ 2021 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ చేరింది. అయితే, టైటిల్ గెలవడంలో విఫలమయ్యారు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్.. ఏడేళ్ల పాటు ఢిల్లీకి తన సేవలు అందించిన తర్వాత పంజాబ్ జట్టుతో 2025లో చేరాడు.