
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెర దించడానికి తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నెలకొన్న వివాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో సమావేశమయ్యారు. సినీ కార్మికుల వేతనాల పెంపు, సమ్మె విరమణపై ఇరువర్గాలకు కోమటిరెడ్డి రాజీ మార్గాన్ని సూచించారు
సమస్యను పెద్దది చేయొద్దు
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ నేతృత్వంలో కార్మికుల బృందం మంత్రి కోమటిరెడ్డిని కలిసింది. ఈ భేటీలో కార్మికులు తమ డిమాండ్లను మంత్రికి వివరించారు. అన్ని యూనియన్లకు ఒకే తరహాలో వేతనాలు పెంచాలని కోరినట్లు అనిల్ తెలిపారు. తమ సమస్యలను మంత్రి సానుకూలంగా విన్నారని, ఆయన ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే, మంత్రి కోమటిరెడ్డి మాత్రం తక్షణమే సమ్మెను విరమించాలని కోరారు. పని చేస్తూనే మీ డిమాండ్లను నెరవేర్చుకోవాలి. సమస్యను పెద్దది చేయొద్దు అని చెప్పినట్లు కార్మికుల నేతలు తెలిపారు. ఇయర్ వైజ్ పెంపునకు ఒప్పుకోవాలని ఫెడరేషన్ కి మంత్రి సూచించారు.
సామరస్యంగా సమస్యకు పరిష్కారం..
మరోవైపు, మంత్రి కోమటిరెడ్డి అగ్ర నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చిన్న నిర్మాతల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని, ఈ వివాదాన్ని వెంటనే ముగించాలని ఆయన దిల్ రాజును కోరారు. "మీరు కొంచెం వేతనం పెంచండి, వాళ్లు కొంచెం తగ్గించుకుంటారు" అనే రాజీ సూత్రాన్ని మంత్రి ప్రతిపాదించారు. ఒకేసారి జీతాలు పెంచాలంటే అందరికీ ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమ్మెతో చిన్న నిర్మాతలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని, సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించాలని మంత్రి కోరారు. FDC ఆధ్వర్యంలో ఇరువర్గాలతో మీటింగ్ ఏర్పాటు చేయాలని దిల్ రాజుకు కోమటిరెడ్డి సూచించారు.
ముగింపునకు తెరపడేనా?
ఈ భేటీల తర్వాత, ఇరుపక్షాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మంత్రి సూచన మేరకు, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ కో-ఆర్డినేషన్ కమిటీ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్‌లో వేతనాలను ఇయర్ వైజ్ గా పెంచే విధానంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపటి భేటీలో ఒక అంతిమ నిర్ణయం తీసుకుంటామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. ఈ పరిణామాలన్నీ టాలీవుడ్‌లో నెలకొన్న సంక్షోభానికి త్వరలోనే తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.