భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకొని 2025 డిసెంబర్ 26న 101వ సంవత్సరంలోనికి ప్రవేశించింది. 1925 డిసెంబర్ 25న కాన్పూర్‌లో జరిగిన సభ అప్పటికే భారతదేశంలో వివిధ ప్రావిన్సులలో పనిచేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు, లేబర్ పార్టీల గ్రూపులుగా ఉన్నవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి జరిపిన మొదటి మహాసభ.
కాన్పూర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ జరుగుతున్న సమయంలోనే ఈ మహాసభ జరపడానికి నిర్ణయించి.. దేశంలోని అన్ని కమ్యూనిస్టు గ్రూపులకు ఆహ్వానాలు అందాయి. 300 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. అదే సమయంలో కమ్యూనిస్టులపై బ్రిటిష్ ప్రభుత్వం రెండో కాన్పూర్ కుట్ర కేసు మోపి కొందరు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది.
డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా సీపీఐ శత వసంతాల ఉత్సవాలు
కాన్పూర్ మహాసభ రెండో రోజున (1925 డిసెంబర్ 26) తీర్మానాలు చర్చించి ఆమోదించారు. 27వ తేదీన పార్టీ నిబంధనావళి ఆమోదం, కేంద్ర కార్యవర్గ ఎన్నిక జరిగాయి. 28వ తేదీన కేంద్ర కార్యవర్గం సమావేశమై అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీలను ఎన్నుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి కార్యవర్గంలోనికి సభ్యులను కో-అప్ట్ చేసుకోవడానికి నిర్ణయించారు.
మహాసభ ఆమోదించిన తీర్మానాలలో పార్టీ పేరు ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా’ అని ఉండాలని తీర్మానించారు. భారతీయ శ్రామికవర్గానికి 'భారత కమ్యూనిస్టు పార్టీ' (సీపీఐ) ఏర్పడినట్లు ప్రకటించారు. అప్పటికే దేశంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న బొంబాయి, కలకత్తా, మద్రాస్, లాహోర్ కమ్యూనిస్టు గ్రూపులన్నీ మహాసభకు వచ్చాయి.
ఆనాడు కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌లో భారత ప్రతినిధిగా ఉన్న ఎంఎన్ రాయ్ 1926 మార్చి 20న భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావాన్ని గుర్తిస్తున్నట్లు తెలియజేశారు. ఆ విధంగా 1925లో జరిగిన మహాసభ ‘కమ్యూనిస్టు ఇంటర్నేషనల్’ గుర్తింపు పొందింది. పార్టీ అధ్యక్షులుగా ఎం సింగార్ వేలు చెట్టియార్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వి ఘాటేను ఎన్నుకున్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యాలయం బొంబాయిలో నెలకొల్పడానికి నిర్ణయించారు. సింగారువేలు చెట్టియార్ 1923లో స్థాపించిన 'లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్' కూడా సీపీఐలో చేరింది. భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థాపక సభ జరిగిన 1925 డిసెంబర్ 26ను పార్టీ సంస్థాపక దినంగా నిర్ధారణ చేయడమైనది.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి!
మొదటిసారిగా కార్ల్‌మార్క్స్-, ఫ్రెడరిక్ ఎంగెల్స్ 1848లో కమ్యూనిస్టు ప్రణాళికను ప్రకటించడంతో ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమ శకం ప్రారంభమైంది. భూర్జువావర్గ దోపిడీ వ్యవస్థను తుదముట్టించాలని దాని స్థానంలో కార్మికవర్గ రాజ్యం స్థాపించాలని అందుకోసం 'ప్రపంచ కార్మికులారా- ఏకంకండి!, పోరాడితే పోయేదేమీ లేదు-బానిస సంకెళ్లు తప్ప!' అని కార్మిక, కర్షక, మధ్యతరగతి, రైతు- కూలీ, పేద, దళిత అణగారిన వర్గాలను వెన్నుతట్టి లేపారు.
లెనిన్ నాయకత్వంలో 1917వ సంవత్సరంలో అత్యంత విశాలమైన రష్యా దేశంలో కమ్యూనిస్టు జెండాను ఎగరవేశారు. మార్క్స్, ఎంగెల్స్ కాలంనాటి మార్క్సిజం, మార్క్సిజం–- లెనినిజంగా రూపాంతరం చెందింది. రెండో ప్రపంచయుద్ధంలో ఎర్రసైన్యం రెండు కోట్ల మంది రక్త తర్పణంతో ఫాసిస్టు మూకలను నిలువరించాయి. 1945 మే నెలలో బెర్లిన్ కోటపై అరుణ పతాకాన్ని ఎగురవేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భారతదేశంతో సహా 70 దేశాలు సామ్రాజ్యవాద వలస పాలన నుంచి స్వాతంత్ర్య వాయువులు పీల్చుకున్నాయి.
కమ్యూనిస్టు పార్టీది అద్వితీయ స్థానం
కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో, ఫ్యూడల్ సంస్థానాల విలీనంలో, హైదరాబాద్ సంస్థానాధీశుడైన నైజాం రాచరికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భూస్వామ్య శృంఖలాలను తెంచడంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకమైనది. ఆంధ్ర మహాసభ కార్యక్రమాలలో క్రియాశీలకంగా ప్రవేశించి గ్రంథాలయ ఉద్యమం, రాత్రి బడులు లాంటి చిన్నచిన్న సంస్కరణల ద్వారా రైతాంగ ఉద్యమానికి పునాదులు వేసింది.
నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను వెన్నుతట్టి నిలబెట్టి సాయుధ పోరాటం నిర్వహించింది. ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు వీరమరణం పొందారు. 3 వేల గ్రామాలను విముక్తి చేసి గ్రామరాజ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ‘దున్నేవానికే భూమి’ అనే కీలక నినాదాన్ని ముందుకు తేవడం ద్వారా దేశంలో భూసంస్కరణలు అమలు జరపడానికి కమ్యూనిస్టుల పోరాటమే మూలం. తెలంగాణలో 10 లక్షల ఎకరాల దొరల భూస్వాముల భూములను ప్రజల పరం చేయడమైనది. జాగీర్దారి, జమీందారీ వ్యవస్థకు గోరీకట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ కారణభూతమైంది.
కమ్యూనిస్టు గ్రూపుల ఐక్యతకు కృషి
పీడిత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందే సీపీఐని మార్క్సిజం– -లెనినిజంకు వ్యతిరేకంగా మావోవాద పిడివాద సిద్ధాంతాలతో బద్దలుగా చీల్చారు. ఫలితంగా కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనానికి ఆటంకం కలిగింది. సీపీఐ నుంచి సీపీఎంగా చీలినవారు చీలికను నేటికీ కొనసాగిస్తున్నారు . విప్లవోద్యమం ముందుకు పోయిందని నమ్మచూపడం దురదృష్టకరం.
1969లో సీపీఐ(ఎంఎల్) గ్రూపులుగా విడిపోయి సైద్ధాంతిక విభేదాలు పేరుతో ఆయా పార్టీలు గ్రూపులుగా చీలికలు, పీలికలుగా విడిపోవడంతో చిన్నచిన్న గ్రూపులుగా ప్రస్తుతం ఉనికిలో ఉన్నాయి. ఇందులో కొన్ని వర్గాలు ఎన్నికల్లో పాల్గొనాలని, మరి కొన్ని నేటికీ వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఎన్నికలు బహిష్కరణ నినాదం ఇచ్చిన నక్సలైట్లకు కొంతకాలం కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, రవూఫ్ లాంటి నేతలు నేతృత్వం వహించారు.
కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్లమల ప్రాంతాలలో ఉద్యమాలు నిర్మించినప్పటికీ పాలకుల అణచివేత చర్యలతో, ఎన్కౌంటర్ల వల్ల మిగిలిన నేతలు దండకారణ్యం బాట పెట్టారు. 2004లో విప్లవ గ్రూపులు కలిసి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా అవతరించి దేశంలో వివిధ ప్రాంతాలలో విస్తరించి.. దండకారణ్యంను బేస్‌గా చేసుకొని ఈ పార్టీ పనిచేసింది.
మావోయిస్టులపై బీజేపీ ఉక్కుపాదం
కేంద్రంలో సంఘ పరివార్ రాజకీయ ఎజెండాగా కలిగిన బీజేపీ అధికారంలోనికి రావడంతో దండకారణ్యం నక్సల్స్ పైన ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ కగార్' పేరుతో సైన్యంను దించి నక్సలైట్ ఉద్యమం ఊపిరాడకుండా చేయడంలో కేంద్రం సఫలం అయిందనే చెప్పాలి. ఇది విప్లవ గ్రూపులను ఆలోచింపజేస్తున్నది. ఒకవైపు అతివాద పొరపాట్లు, మరోవైపు ఎన్నికల్లో పాల్గొంటున్న కమ్యూనిస్టు పార్టీలు ఇతర పార్టీలతో పెట్టుకున్న అవకాశవాద రాజకీయ పొత్తుల వలన ఎర్రజెండా ఉనికి ప్రశ్నార్థకమై మనుగడను కొనసాగిస్తూ ముందుకుపోతున్నాయి.
దేశ అభివృద్ధి కోసం, శ్రామిక ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నది సీపీఐ. కష్టజీవుల ఆశాజ్యోతి కమ్యూనిస్టు పార్టీ అత్యంత పాశవికమైన నిర్బంధాలను, జైళ్లను, లాఠీలను, తుపాకి గుండ్లను ఎదిరించి మేరు పర్వతంలా నిలబడింది. ఇంతటి త్యాగాలు, రక్తతర్పణలు చేసిన రాజకీయ పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొకటి లేదని కమ్యూనిస్టు పార్టీ సగర్వంగా చెప్పగలదు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీపీఐని ఆశీర్వదిద్దాం!
ప్రజల ఆశాజ్యోతి సీపీఐ
దేశ సమగ్ర అభివృద్ధి కోసం, భూ సంస్కరణలు, పేదవారికి భూముల పంపిణీ, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు నెలకొల్పటం, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం, రాష్ట్రంలో అసంఘటితంగా ఉన్న వ్యవసాయ కార్మికులు, చేనేత, గీత, బీడీ కార్మికులను చైతన్యపరుస్తూ వారి దైనందిన సమస్యల కోసం సీపీఐ పోరాడింది. బొగ్గుగని కార్మికులు, ఆర్టీసీ, జౌళి, జూట్, సిమెంట్, చక్కెర ఫ్యాక్టరీ, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థల్లో ఇంకా అనేకవాటిల్లో పనిచేసే లక్షలాది కార్మికుల తరఫున పోరాడుతోంది.
పంటలకు గిట్టుబాటు ధర కావాలని, విద్యార్థి, యువజన, మహిళా, దళితుల, గిరిజన అభ్యున్నతికి నిత్యం పోరాటాలు నిర్వహిస్తోంది. దేశ ఉన్నతి కోసం, శ్రామిక ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతోంది.
- ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్ నేత-
