కమ్యూనిస్టులు, కోదండరాంను కలుపుకుపోదాం

కమ్యూనిస్టులు, కోదండరాంను కలుపుకుపోదాం

మునుగోడులో ప్రచారంపై వీడియో విడుదల

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉపఎన్నికల్లో ప్రచారాంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ప్రజా సమస్యలనే ప్రస్తావించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్​ఎస్ కుట్రలు గమనించి వాటిపై పోరాడాలన్నారు. వ్యక్తిగత దూషణలు, వివాదాలతో రాజకీయ లబ్ధిపొందేందుకు చూస్తున్నారని, అలాంటి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కరోనాతో ఐసోలేషన్​లో ఉన్న ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. మునుగోడు ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు సూచనలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను వంచిస్తూ వస్తున్నాయనీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదన్నారు. దీనిపై ప్రజల్లో ఆయా పార్టీల నేతలను నిలదీయాలన్నారు. కమ్యూనిస్టులు, కోదండరాంను కలుపుకుపోవాలన్నారు. మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ, టీఆర్​ఎస్​లు మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బీజేపీ గెలిచినప్పటి నుంచి ఆ ఊసే ఎత్తడంలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతోందనీ, యువత నిరాశ నిస్పృహలో ఉన్నారన్నారు. ధరల నియంత్రణలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం టీఆర్​ఎస్​ ఎందుకు పోరాడట్లేదని నిలదీయాలన్నారు. టీఆర్​ఎస్ సర్కారు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేసిందన్నారు. మునుగోడుకు కేంద్రం 5 వేల కోట్ల నిధులిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయనీ, కేంద్రం నుంచి వాటిని రాబట్టాలని బీజేపీ నేతలకు సూచించారు.

రేవంత్​కు కరోనా

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​గా తేలింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో కరోనా టెస్ట్​ చేయించుకున్నారు. ఆదివారం పాజిటివ్​గా రిజల్ట్ వచ్చింది. దీంతో ఇటీవల తనను కలిసిన వారిని పరీక్షలు చేయించుకోవాలని రేవంత్​ ట్వీట్​ చేశారు.