లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికిన కమ్యూనిటీ హెల్త్​ ఆఫీసర్

లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికిన కమ్యూనిటీ హెల్త్​ ఆఫీసర్

మెదక్, వెలుగు : మెదక్  జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ ఆఫీసులో పనిచేసే కమ్యూనిటీ హెల్త్​ ఆఫీసర్ ​ఫహీం పాషా రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం... ఫిజియోథెరపిస్ట్​ సతీశ్​​ నర్సాపూర్​లో ఫిజియోథెరఫీ క్లినిక్ ​ఏర్పాటు చేసేందుకు పర్మిషన్​ కోసం నెల రోజుల కింద ఆన్​ లైన్​లో అప్లై చేశాడు. తర్వాత జిల్లా కేంద్రమైన మెదక్​లోని డీఎంహెచ్​ఓ ఆఫీస్​కు వెళ్లి అవసరమైన సర్టిఫికెట్లు, బ్యాంక్​ డీడీ అందజేశారు.

సంబంధిత ఫైల్​ప్రాసెస్​ చేసేందుకు ఆఫీస్​లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్​ఆఫీసర్​(సీహెచ్ఓ) ఫహీం పాషా రూ.15 వేలు డిమాండ్ చేశారు. దీంతో సతీశ్​ఏసీబీని ఆశ్రయించాడు.  గురువారం ఫహీం పాషా మెదక్​లోని డిపో బస్టాండ్​ దగ్గర సతీశ్​ నుంచి లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఫహీం పాషాను అదుపులోకి తీసుకుని కలెక్టరేట్​లోని డీఎంహెచ్​ఓ ఆఫీస్​కు తీసుకువెళ్లి ఎంక్వైరీ చేశారు. ఇంకెవరిదైనా పాత్ర ఉందా అనేది విచారణలో తెలుస్తుందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ తెలిపారు. దాడుల్లో వెంకట్​రాజాగౌడ్, నవీన్​ ఉన్నారు.