రాజీమార్గం ద్వారా వివాదాల పరిష్కారం : తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్

రాజీమార్గం ద్వారా వివాదాల పరిష్కారం : తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్

ఆసిఫాబాద్ , వెలుగు: రాజీమార్గం ద్వారా వివాదాలను పరిష్కరించేందుకు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ తెలిపారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్  ఏర్పాటు, నిర్వహణపై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ముందుగా పహల్గాం బాధితులకు నివాళిగా మౌనం పాటించారు. అనంతరం చీఫ్ గెస్ట్ గా హాజరైన సుజోయ్ పాల్ మాట్లాడుతూ.. కేరళలో ప్రారంభమైన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లలో చిన్న చిన్న కుటుంబ, ఇతర తగాదాలను కమ్యూనిటీ పెద్దల సమక్షంలో చర్చించుకుని రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయన్నారు.

తద్వారా రాబోయే తరాలకు ఎలాంటి వివాదాలు లేకుండా ఉండే చాన్స్ ఉంటుందన్నారు.  సయోధ్య ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంతో పోలీస్ స్టేషన్లలో, కోర్టుల్లో కేసులు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డిలో  ప్రారంభించామని,10వ మీడియేషన్ సెంటర్ ను ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మీడియేషన్ సెంటర్ ద్వారా సమస్యల పరిష్కారానికి పలు కమ్యూనిటీల సభ్యులు ముందుకు రావాలని, త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు.

ఆ తర్వాత రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, ఉట్నూరు ఐటీడీఏ పీఓఖుష్బూ గుప్తా, జిల్లా న్యాయమూర్తులు యువరాజా, అనంతలక్ష్మి, అజయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ మాట్లాడారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ నీరజ్ కుమార్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, ఏఎస్పీ చిత్తరంజన్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.