గతేడాదితో పోలిస్తే గ్రౌండ్ వాటర్ ఈసారి చాలా బెటర్

 గతేడాదితో పోలిస్తే  గ్రౌండ్ వాటర్ ఈసారి చాలా బెటర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర్ నెలాఖరుతోపాటు అక్టోబర్​లో కురిసిన వర్షాలకు గ్రౌండ్ వాటర్ ఒకటి నుంచి రెండు మీటర్లు పైకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని 95 శాతం ప్రాంతాల్లో నీటిమట్టాలు పెరిగినట్లు అధికారులు విడుదల చేసిన గణాంకా లు చెబుతున్నాయి. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా చూస్తే సగటున 2.15 మీటర్ల మేర పెరగడం విశేషం. హైదరాబాద్​లో సగటున 0.37 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 0.33 మీటర్ల మేర పెరిగాయి.  కాగా రాజేంద్రనగర్, గండిపేట, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, సరూర్ నగర్, బాలాపూర్ వంటి ప్రాంతాల్లోని నీటిమట్టాల్లో ఎలాంటి మార్పు లేదు. 

ఆ 10 ప్రాంతాల్లోనూ..

గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ చెక్ చేస్తున్న 10 ప్రాంతాల్లోనూ ఈసారి నీటిమట్టాలు పెరిగినట్లు గుర్తించారు. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో గతేడాది 5 నుంచి 8 మీటర్ల లోతులో నీరు ఉండగా, ప్రస్తుతం మీటర్ లోపే ఉన్నాయి. లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో గతేడాది 2.19 మీటర్ల లోతులో నీరు ఉండగా, ప్రస్తుతం 1.05 మీటర్ల లోతులో నే ఉంది. ఇలా అన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వర్షాలతో నీటి మట్టాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఉన్నవాటిని కాపాడుకోవాలి

గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రౌండ్ వాటర్ పెరిగింది. అయితే భవిష్యత్​లో నీటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు కురిసిన సమయంలో వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చూడాలి. అప్పుడే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈసారి కొన్ని ప్రాంతాలు మినహా చాలా చోట్ల నీటమట్టాలు పెరిగాయి. 

– పి.రఘుపతిరెడ్డి, డిప్యూటీ డైరక్టర్,​ గ్రౌండ్ వాటర్ డిపార్ట్​మెంట్, రంగారెడ్డి జిల్లా