లాభాల్లో వాటా సేమ్.. చేతికందేది సగమే!

లాభాల్లో వాటా సేమ్..  చేతికందేది సగమే!
  • 28 శాతం వాటాప్రకటించిన సర్కారు
    లాభాలు తగ్గించి మోసం చేశారంటూ కార్మికుల ఆరోపణ

మందమర్రి, వెలుగుగత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా మొత్తం సగమే అందనుంది. ఈ ఏడాది ఉత్పత్తి పెరిగినా లాభాలు మాత్రం తగ్గాయి. ఆ మేరకు కార్మికులకు అందే మొత్తం కూడా తగ్గనుంది. సింగరేణి కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లాభాల్లో వాటా ప్రకటన శనివారం వెలువడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​సింగరేణి సంస్థ 2019–-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో  కార్మికులకు 28 శాతం వాటాను ప్రకటించారు. ఈ మేరకు సీఎం ప్రిన్సిపల్​సెక్రటరీ ఎస్. నర్సింగరావు సింగరేణి సీఎండీకి ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి 2019–-20 ఆర్థిక సంవత్సరంలో రూ.993 కోట్ల లాభాలను ఆర్జించినట్లు ఇటీవల సింగరేణి డైరెక్టర్ల బోర్డ్​ మీటింగ్​లో ప్రకటించిన విషయం తెలిసిందే. గుర్తింపు సంఘం, కోల్​బెల్ట్​ప్రజాప్రతినిధులు సీఎంను కలిసి లాభాల్లో కార్మికుల వాటాను ప్రకటించే ఆనవాయితీ ఈ దఫా కనిపించలేదు. కంపెనీ సాధించిన లాభాలను తక్కువగా ప్రకటించడంతో పాటు కార్మికుల వాటా గత ఏడాది కన్నా ఒక్కశాతం కూడా పెంచకపోవడం సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ వైఫల్యమంటూ ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

28 శాతం వాటాగా రూ.278.04 కోట్లు

సింగరేణి కంపెనీ 2019-–20 ఆర్థిక సంవత్సరం ఆర్జించిన రూ.993 కోట్లు లాభాల్లో 45 వేల మంది కార్మికులకు 28 శాతం వాటాగా 278.04 కోట్లు అందనున్నాయి. మస్టర్లు, ఇన్సెంటివ్, గ్రూప్​ఇన్సెంటివ్​ప్రాతిపదికన కార్మికులకు వాటా మొత్తం అందనుంది. 100 మస్టర్లలోపు ఉన్న కార్మికులు లాభాల వాటాకు అనర్హులు.  సీఎం ఆదేశాలతో కార్మికులకు చెల్లించే లాభాల వాటాపై రెండు మూడు రోజుల్లో యాజమాన్యం తేదీని ఖరారు చేసే అవకాశముంది. గత ఏడాది(2019-–20)  64 మిలియన్​ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా రూ.993 కోట్లు లాభాలు వచ్చినట్లు సింగరేణి ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2018-–19లో అదే స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధిస్తే రికార్డు స్థాయిలో రూ.1,766 కోట్లు లాభాలు వచ్చాయి. కార్మికుల వాటాగా రూ. 494.48 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది మరో రెండు మిలియన్​టన్నులు ఉత్పత్తి పెరగడంతో లాభాలు  రూ.2 వేల కోట్ల వరకు వస్తాయని కార్మికులు అంచనా వేశారు. కానీ కేవలం రూ.993 కోట్లు వచ్చినట్లు సింగరేణి ప్రకటించింది. దాంతో గత ఏడాదికంటే కార్మికులకు రూ. 216 కోట్లు తక్కువ అందనున్నాయి.  2018-–19 ఆర్థిక సంవత్సరం కార్మికులు ఒక్కొక్కరికి సుమారు రూ.లక్ష వరకు అందాయి. ఈ ఏడాది అందులో సగం మాత్రమే అందుతాయి.

కార్మికులను మోసం చేసిన్రు

బొగ్గు ఉత్పత్తి పెరిగినా సింగరేణి తక్కువ లాభాలు చూపించింది. పైగా లాభాల్లో కేవలం 28 శాతం వాటాగా ప్రకటించి తెలంగాణ సర్కార్, సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కార్మికవర్గాన్ని మోసం చేశాయని ఏఐటీయూసీ జనరల్​సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ జనరల్​సెక్రటరీ బి.జనక్​ప్రసాద్, బీఎంఎస్​స్టేట్​ప్రెసిడెంట్​కెంగర్ల మల్లయ్య, సీఐటీయూ జనరల్​సెక్రటరీ మందా నర్సింహారావు మండిపడ్డారు. నిన్నమొన్నటి వరకు టీబీజీకేఎస్ లీడర్లు సర్కారుతో మాట్లాడి 30 శాతం లాభాల వాటా ఇప్పిస్తామని ప్రగల్భాలు పలికారని, గత ఆర్థిక సంవత్సరం కంటే కనీసం ఒక శాతం కూడా ఎక్కువ ఇప్పించలేకపోయారని అన్నారు. సింగరేణి సొమ్మును తెలంగాణ సర్కార్​కు మళ్లించడమే తక్కువ లాభాలు రావడానికి కారణమని ఆరోపించారు. లాభాలు, లాభాల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

నిరాశలో కార్మికులు

మొదటిసారిగా 1999-2000 ఆర్థిక సంవత్సరం 10 శాతం లాభాల వాటాను అందించిన సింగరేణి వరుసగా పెంచూతూ  2012-13 ఆర్థిక సంవత్సరం వరకు 18 శాతం వాటాను చెల్లించింది. తెలంగాణ సర్కార్​అధికారంలోకి రావడంతో లాభాల వాటాను  ఏకంగా రెండు శాతం పెంచి 2013-14 ఆర్థిక సంవత్సరం 20 శాతం అందించి కార్మికుల్లో ఆశలు రేపింది. అప్పటి నుంచి వరుసగా  21, 23, 25, 27, 28 శాతం పెంచుకుంటూ వచ్చింది. ఈ దఫా కనీసం 30 శాతం వరకు పెంచుతుందని కార్మికులు ఆశపడ్డారు. అయితే ఆరేళ్ల తర్వాత ఒక్కశాతం కూడా పెంచకుండా కేవలం 28 శాతం వాటాను ప్రకటించడంతో కార్మికులు అసంతృప్తికి గురవుతున్నారు.