వస్తువులు పోగొట్టుకున్నారా.. మీ సేవకు వెళ్లాల్సిందే!

వస్తువులు పోగొట్టుకున్నారా.. మీ సేవకు వెళ్లాల్సిందే!
  • విలువైన సర్టిఫికెట్లు, గోల్డ్ పోగొట్టుకున్నా చలానా​ కట్టాల్సిందే..
  • చోరీ అయితేనే స్టేషన్ లో నేరుగా ఫిర్యాదు స్వీకరణ
  • ప్రాసెస్ సింపుల్ చేసేందుకే  అంటున్న పోలీస్ ఆఫీసర్లు
  • ఇదో రకం దోపిడీ అంటున్న పబ్లిక్

మార్కెటింగ్ జాబ్ చేసే పి.సురేశ్​ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాడు. థియేటర్ లో రూ.50వేల విలువైన సెల్ ఫోన్  పొగొట్టుకున్నాడు. సినిమా ముగిశాక బయటికి వచ్చి చూస్తే, జేబులో సెల్ ఫోన్ కనిపించలేదు. హాల్​లో వెతికితే దొరకలేదు.  దీంతో వెంటనే పోలీస్ స్టేషన్  వెళ్లి విషయం చెబితే మీసేవాలో చలానా కట్టి తెస్తేనే కంప్లయింట్​తీసుకుంటామన్నారు. సండే కావడంతో మీ సేవా తీసిలేదు. సోమవారం పోలీసులు చెప్పిన ప్రకారం మీసేవాకు వెళ్తే రూ.150 తీసుకుని సెల్ ఫోన్ పోయినట్టు ఆన్ లైన్ లో కంప్లయింట్​ రిజిస్టర్ చేసి ఒక రిసిప్ట్ చేతిలో పెట్టారు. 

ఖమ్మం, వెలుగు: మీరు ఖరీదైన సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా? విలువైన మీ సర్టిఫికెట్లు కనిపించడం లేదా ? జర్నీలో బంగారాన్ని మిస్ చేసుకున్నారా? అయితే వెంటనే మీరు సమీపంలోని మీ సేవా సెంటర్ కు వెళ్లాలి. అదేంటి, ఏదైనా పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్ కి కదా పోవాల్సింది అని అనుమానపు ఫేస్​ పెట్టాల్సిన పనిలేదు. కొద్దిరోజులుగా ఇలాంటి కంప్లయింట్స్​ను పోలీస్ స్టేషన్ లో కాకుండా, మీ సేవాలోనే 
తీసుకుంటున్నారు.

రూ.145 చలానా కట్టాలి.. 

 సినిమాహాళ్లలో, మాల్స్​లో, ఇతర పబ్లిక్​ ప్లేస్​లలో, జర్నీలో సెల్​ఫోన్​, బ్యాగ్​, పర్స్​, డాక్యుమెంట్లు, నగలు పోగొట్టుకున్న వాళ్లు నేరుగా పోలీస్​స్టేషన్​కు వెళ్తే కంప్లయింట్​తీసుకోవడం లేదు. బాధితులకు మీ సేవాలో కంప్లయింట్​చేయాలని సూచిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే రూ.145 చలానా కట్టాలనేసరికి జనం బిత్తరపోతున్నారు. గతంలో ఇలాంటి కంప్లయింట్లను పోలీస్​స్టేషన్​లో ఫ్రీగా తీసుకొని ఎంక్వైరీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్​అమల్లోకి తెచ్చారు. అసలే వస్తువు పోగొట్టుకున్న బాధలో ఉన్న వాళ్లను మీ సేవాల చుట్టూ తిప్పించడం,రూ.145 ఖర్చు పెట్టించడం ఎంత వరకు సమంజసమని బాధితులు అంటున్నారు. 

 రెండు రకాల కంప్లయింట్స్​ 

వస్తువులు పోగొట్టుకున్నప్పుడు కంప్లయింట్​విషయంలో పోలీసులు రెండు విధానాలను అమలు చేస్తున్నారు. సెల్ ఫోన్ అయినా, సర్టిఫికెట్లు లేదా బంగారం.. ఇలా ఏ వస్తువు అయినా చోరీకి గురైతే  స్టేషన్ కు వచ్చి కంప్లయింట్​చేయవచ్చని సూచిస్తున్నారు. ఎక్కడైనా దొంగతనం జరిగిందని అనిపిస్తేనే డైరెక్ట్ కంప్లయింట్​ తీసుకుంటామని అంటున్నారు. ఓనర్ నిర్లక్ష్యం కారణంగా వస్తువును పోగొట్టుకుంటే మాత్రం మీసేవా లేదంటే ఈసేవాలో కంప్లయింట్​రిజిస్టర్ చేయొచ్చని చెబుతున్నారు దీని ద్వారా బాధితులకు త్వరగా కంప్లయింట్​ ఇచ్చే చాన్స్​తో పాటు కేసును ఎప్పటికప్పుడు ఫాలోఅప్​చేసే చాన్స్​ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కానీ బాధితుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫ్రీగా కంప్లయింట్​ఇచ్చే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆన్​లైన్​ రూపంలో కొత్త దోపిడీకి తెరలేపారని అంటున్నారు. పోలీసులు చెప్పే కారణం కరెక్ట్​గా లేదని, మున్ముందు అన్ని రకాల కంప్లయింట్లకు పేమెంట్​వసూలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ చలానా కట్టాక పోగొట్టుకున్న వస్తువుకు సంబంధించి ఏడు రోజుల్లో సమాచారం ఇస్తామని  పోలీసులు చెబుతున్నా, ఫోన్​ చేస్తే సరిగ్గా స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు. దొరికినప్పుడు ఇస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని, అలాంటప్పుడు కంప్లయింట్​కు చలానా కట్టించుకోవడం ఎంతవరకు కరెక్ట్​అని పబ్లిక్​ ప్రశ్నిస్తున్నారు.