బెంగుళూర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్.. విరాట్ కోహ్లీపై వెంకటేష్ ఫిర్యాదు..!

బెంగుళూర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్.. విరాట్ కోహ్లీపై వెంకటేష్ ఫిర్యాదు..!

బెంగుళూర్: ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగుళూర్‎లో తొక్కిసలాట జరిగిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చినస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ  కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎం వెంకటేష్ అనే వ్యక్తి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విరాట్ కోహ్లీపై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోహ్లీపై అందిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు స్పందించారు. వెంకటేష్ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిశీలిస్తామని, దర్యాప్తు సమయంలో దానిని ధృవీకరిస్తామని పేర్కొన్నారు. 

కాగా, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. 2025, జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్‎ను చిత్తు చేసి.. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్నా ఐపీఎల్ టైటిల్‎ను దక్కించుకుంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో జట్టు ఆటగాళ్లను సత్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) బుధవారం (జూన్ 4) ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించింది. 

ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు తండోపతండాలు ఎగబడ్డారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు ఉంటే.. దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి.. 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సుమోటోగా తీసుకున్న కర్నాటక హైకోర్టు.. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఆర్‌సీబి బృందం, కెఎస్‌సీఎ, డీఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులపై కేసు నమోదు చేశారు.  ఇందులో భాగంగా శుక్రవారం (జూన్ 6) తెల్లవారుజామున ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను, విజయోత్సవ ర్యాలీ నిర్వాహకులు DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై ఫిర్యాదు అందటం చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీ యజమాన్యంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. కోహ్లీపై కేసు నమోదు చేయడంపై సాధ్యమేనా అన్న దానిపై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. మరీ కోహ్లీపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది చూడాలి.