పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని ఎస్సై పై హెచ్ఆర్సీ లో ఫిర్యాదు

పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని ఎస్సై పై హెచ్ఆర్సీ లో ఫిర్యాదు

ఓ భూవివాదానికి సంబంధించి పెద్దపల్లి జిల్లా మంథని ఎస్సై త‌మ‌ను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడ‌ని, అత‌ని పై చర్యలు తీసుకోవాలని… ఓ కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. తమ భూమి వివాదంలో తలదూర్చడమే కాకుండా…. తమపై అక్రమ కేసులు పెట్టి మంథని ఎసై ఓంకార్ యాదవ్ వేధిస్తున్నాడని మల్లారం గ్రామానికి చెందిన సాయిని సరిత, సాయిని రమేష్ అనే అక్కాత‌మ్ముళ్లు కమిషన్ కు వివరించారు.

తమ తండ్రి పేరుపై ఉన్న 10 గుంటల భూమిని తమ బాబాయ్ అక్రమించేందుకు యత్నిస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 30న తమ బాబాయ్ సాయిని వెంకన్న , పిన్ని పద్మ , వారి కొడుకు అవినాష్ లు తమ కుటుంబం పై దాడి చేశారని… ఈ వ్యవహారంపై స్థానిక మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎస్సై ఓంకార్ యాదవ్ తమ 10 గుంటల భూమిని వదులుకోవాలని… తమను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా… విచక్షణ రహితంగా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాబాయ్ మహిళా అని చూడకుండా వివస్త్రను చేసి దాడి చేశారని వారు పేర్కొన్నారు. తమకు, తమ కుటుంబానికి తమ బాబాయి నుండి , ఎస్సై నుండి ప్రాణహాని ఉందన్నారు. కబ్జాదారులకు మద్దతు ఇస్తున్న ఎస్సై పై క్రిమినల్ కేసు నమోదు చేసి… తమకు తమ రక్షణ కల్పించాలని వారు హెచ్చార్సీని వేడుకున్నారు.