
వికారాబాద్ కలెక్టర్‌పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
వికారాబాద్ జిల్లా, వెలుగు: మరుగుదొడ్లు కట్టుకోలేదని కరెంటు కనెక్షన్ కట్ చేసి జీవించే హక్కుకు భంగం కలిగిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్‌పై గురువారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. బహిర్భూమికి వెళ్తున్న మహిళల ఫొటోలు తీయించి వైరల్ చేయించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటయ్య కమిషన్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండంలోని నాగసముందర్ గ్రామంలో 35 మంది పేదలు మరుగుదొడ్లు నిర్మించుకోలేదని కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు వారి ఇండ్లకు కరెంట్ కట్ చేశారన్నారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ సిబ్బందితో కలిసి బహిర్భూమికి వెళ్తున్న మహిళలను ఆపి పోటోలు తీశారన్నారు. వాటిని మీడియా, సోషల్ మీడియాల్ వైరల్ చేయించి వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారని తెలిపారు. మర్పల్లి మండలంలోని బూచన్‌పల్లిలో మరుగుదొడ్లు నిర్మించుకోలేరనే పేరుతో ఎంపీడీవో బహిర్భూమికి వెళ్లేవారిని ఆపి అవమానపరిచారని తెలిపారు. ఘనాపూర్, తాండూరు మండలాల్లో అధికారులు కూడా ఇలాగే చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్-21 కల్పించిన జీవించే హక్కుకు భంగం కలిగిస్తూ, మహిళల్ని కించపరుస్తున్న కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.