
- కరీంనగర్ బల్దియాలో సెల్ఫ్ అసెస్‌మెంట్ దుర్వినియోగం
- 202 ఇంటి నంబర్ల గుర్తింపు
- కార్పొరేషన్ రెవెన్యూ రికార్డుల నుంచి తొలగింపు
- ఆ ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరీంనగర్, గంగాధర సబ్ రిజిస్ట్రార్లకు అడిషనల్ కమిషనర్ లేఖ
కరీంనగర్, వెలుగు: ఖాళీ జాగాలో ఇల్లు లేకపోయినా ఉన్నట్లు హౌస్ నంబర్లు తీసుకుని, వాటి ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 202 ఇంటి నంబర్లను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు గుర్తించారు. సదరు ఇంటి నంబర్లను ఆధారంగా చేసుకుని ఇక మీదట కరీంనగర్ రూరల్, గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేయొద్దని కోరుతూ ఆయా రిజిస్ట్రార్లకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ తాజాగా లేఖ రాశారు. గత సర్కార్ ఆన్‌లైన్ లో తీసుకొచ్చిన సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు పద్ధతిలో ఇంటి నంబర్లు పొందారని అడిషనల్ కమిషనర్ పేర్కొన్నారు.
లేఖతోపాటు 202 ఇంటి నంబర్లు, యజమానుల పేర్లు, డివిజన్ నంబర్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్లతో కూడిన జాబితాను జిల్లా రిజిస్ట్రార్‌కు అందజేశారు. అలాగే 202 ఇంటి నంబర్లను కార్పొరేషన్ రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించారు. ఇందులో కరీంనగర్ రేకుర్తి ఏరియాలోని ఇంటి నంబర్లే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎంక్వైరీ చేపట్టి ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న 85 మందికి విజిలెన్స్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చి విచారించారు.
ఇంటి స్థలాల్లో అసైన్డ్, సీలింగ్, సర్కార్ భూములు ?
సాధారణంగా సర్వే నంబర్ లేని గ్రామకంఠం/ఆబాది పరిధిలో పాత ఇళ్ల స్థలాలను ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఇందుకోసం గతంలో 12 ఏళ్లకుపైబడిన పాత ఇంటిపన్ను రికార్డు ఆధారంగా సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు జారీ చేసిన ఓనర్ షిప్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఓనర్షిప్ సర్టిఫికెట్ల జారీ నిలిపివేశారు. అయినా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్, సెల్ఫ్ అఫిడవిట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు ఖాళీ జాగల్లో చిన్న షెడ్డులు వేసి జీపీలు, మున్సిపాల్టీల నుంచి హౌస్ నంబర్ పొందుతున్నారు.
ఆ తర్వాత ఆ హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ ఆధారంగా తొలుత ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారం ఎక్కువగా అసైన్డ్, సీలింగ్, సర్కార్ భూముల్లోనే జరుగుతోంది. ఇదే హౌస్ ట్యాక్స్, ఆ ఇంటి నంబర్ మీద తీసుకున్న ఎలక్ట్రిసిటీ బిల్లును ఆధారంగా చూపి 58, 59 జీవోల కింద రెగ్యులరైజేషన్ చేయించుకుంటున్నారు. ఇది కొందరు లీడర్లు, కబ్జాదారులకు ఆదాయ వనరుగా మారింది. పట్టా ల్యాండ్స్ లోనూ సాగుతున్న ఇదే తరహా వ్యవహారం అనేక భూవివాదాలకు దారితీస్తోంది.
దడ పుట్టిస్తున్న వరస ఘటనలు...
కరీంనగర్ సిటీకి సమీపంలోని కొత్తపల్లి రెవెన్యూ విలేజీ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలోని సీలింగ్ ల్యాండ్ అక్రమ రిజిస్ట్రేషన్లపై లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నేత దివంగత నరెడ్ల శ్రీనివాస్ చేసిన న్యాయ పోరాటం ఫలితంగా లోకాయుక్త ఆదేశాల మేరకు జూన్ మొదటి వారంలో గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 476 రిజిస్ట్రేషన్లను కలెక్టర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల అదే గంగాధర సబ్ రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ ఖాన్ కొత్తపల్లి 272/14 ర్వే నంబర్‌లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన 9 డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేశారు.
తాజాగా బల్దియా 202 ఇంటి నంబర్ల మీద ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరీంనగర్, గంగాధర సబ్ రిజిస్ట్రార్లకు లేఖ రాయడంతో మరో 202 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెల్లకుండపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల రద్దు ఘటనలు, రిజిస్ట్రేషన్ల నిలుపుదల ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. అక్రమార్కుల్లో దడ పుడుతుండగా.. తెలియక కొనుగోలు చేసిన అమాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇద్దరి పేరు మీద 25 ఇంటి నంబర్లు..
కరీంనగర్ బల్దియా ఆఫీసర్లు గుర్తించిన 202 ఇంటి నంబర్లలో ఏకంగా 25 నంబర్లు ఇద్దరి పేరిట జాయింట్‌గా ఉండడం గమనార్హం. అతపురం శ్రీనివాస్ అండ్ బాబు పేరిట 19వ డివిజన్ లోని ఖాళీ జాగాలకు 25 ఇంటినంబర్లు ఉన్నాయి. ఈ నంబర్లతో 25 డాక్యుమెంట్లు 2022లో రిజిస్టర్ అయ్యాయి. 18వ డివిజన్‌లో రేవోజీ లక్ష్మీ పేరిట 14 ఇంటి నంబర్లు ఉండగా.. ఇందులో 8 డాక్యుమెంట్లు 1995లో, మరో 6 డాక్యుమెంట్లు 2023లో రిజిస్టరయ్యాయి. ముప్పా శ్యాం, జయ పేరిట 5 ఇంటి నంబర్లు ఉన్నట్లు బల్దియా రెవెన్యూ సిబ్బంది గుర్తించారు.