
- పందిరి తోటల ఏర్పాటుకు అర ఎకరానికి రూ.50 వేలు
- గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు రాయితీ
- ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద నిధులు
- సెంట్రల్ స్కీమ్ నుంచి అందనున్న రూ.145 కోట్లు
హైదరాబాద్, వెలుగు : కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రాయితీలతో కూడిన పథకాలను అందజేస్తున్నాయి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్,- ఆయిల్ పాం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పథకాలతో రైతులకు జాతీయ ఉద్యాన మండలి (ఎన్‌హెచ్‌బీ) భారీగా సబ్సిడీలను అందిస్తోంది. సొంత భూమి ఉండి, ఆధునిక పద్ధతులతో ఉద్యాన పంటలు సాగు చేయాలనుకునే రైతులకు ఈ పథకాలు ఉపయోగపడనున్నాయి.
రక్షిత సాగు (నెట్ హౌస్, గ్రీన్ హౌస్) కింద 2,500 చదరపు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో టమాటా, క్యాప్సికం, కీర, దోసకాయ వంటి కూరగాయలు లేదంటే గులాబీ, ఆర్కిడ్, అంథూరియం వంటి పూల సాగుకు ఎన్‌హెచ్‌బీ రూ.1.12 కోట్ల వరకు మంజూరు చేస్తోంది. ఇందులో 50 శాతం సబ్సిడీగా అందనుంది. ఈ నిధులతో నెట్‌హౌస్, గ్రీన్‌హౌస్, యాంటీ-బర్డ్ నెట్స్, టన్నెల్, హెయిల్ నెట్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. బహిరంగ క్షేత్రంలో ఐదెకరాల విస్తీర్ణంలో నిమ్మ, నారింజ, మామిడి, సీతాఫలం, రేగు, అరటి, దానిమ్మ వంటి పండ్ల తోటల సాగుకు రూ.75 లక్షల వరకు మంజూరు చేస్తారు. ఇందులో 40 శాతం (రూ.30 లక్షలు) సబ్సిడీగా అందుతుంది. నేల చదును, సూక్ష్మసేద్యం, యాంత్రీకరణ, నీటిపారుదల వ్యవస్థ, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఈ నిధులను వినియోగించవచ్చు.
కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్హౌజ్లకు అందనున్న రాయితీ
కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల కోసం ప్యాక్‌హౌస్, రీపేనింగ్ చాంబర్, శుద్ధి యూనిట్లు, శీతలీకరణ నిర్మాణాలకు రూ.1.45 కోట్ల వరకు మంజూరు చేయనున్నారు. ఇందులో 30 శాతం అంటే రూ.50.75 లక్షలు సబ్సిడీగా లభిస్తుంది. అలాగే 5 వేల నుంచి 10 వేల టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 35 శాతం సబ్సిడీ అందుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందుతుంది. గరిష్ఠంగా 2.20 ఎకరాల వరకు ఈ రాయితీ పొందవచ్చు.
సన్నకారు రైతులు శాశ్వత పందిరి విధానంలో తీగజాతి కూరగాయలు సాగు చేసి నిరంతర ఆదాయం పొందవచ్చు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, -ఆయిల్ పామ్’ పథకం కింద ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఒక హెక్టార్‌కు 143 మొక్కలు అవసరమవుతాయి. ఒక్కో మొక్క ధర రూ.193 కాగా, పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నారు. అంతర పంటల సాగు కోసం ఏడాదికి హెక్టార్‌కు రూ.5,250, నాలుగేళ్లకు రూ.21,000 సబ్సిడీ ఇస్తారు. ఎరువులు, పురుగుమందులకు కూడా ఇదే మొత్తంలో రాయితీ లభిస్తుంది.
డ్రిప్, స్ప్రింక్లర్లకు సైతం...
‘బిందు సేద్యం’ పథకం కింద డ్రిప్, స్ప్రింక్లర్లకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఐదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. హార్టికల్చర్ పంటలను కోతులు, అడవిపందుల నుంచి కాపాడుకునేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద వివిధ పరికరాలను కూడా అందజేస్తున్నారు.
క్లస్టర్ల ద్వారా సాగు ప్రోత్సాహం
రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనువైన ప్రాంతాలను క్లస్టర్లుగా గుర్తించి రూ.145 కోట్ల కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధుల ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి జిల్లాకు రూ.4.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, దానిమ్మ వంటి తోటల సాగును పెంచేందుకు మొక్కలు, ఎరువులు, నీటి సౌకర్యాలకు రాయితీలు అందిస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవడం ఇలా
రైతులు ఎన్‌హెచ్‌బీ పథకాల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)తో బ్యాంకులను సంప్రదించి, రుణ మంజూరుకు సంసిద్ధత లెటర్ తీసుకోవాలి. తర్వాత www.nhb.gov.in వెబ్‌సైట్‌లో ఆధార్, పాన్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఈసీలతో దరఖాస్తు చేయాలి. హైదరాబాద్‌లోని అబిడ్స్ చిరాగ్ అలీ లేన్‌లో ఉన్న ఎన్‌హెచ్‌బీ ప్రాంతీయ కార్యాలయంలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పథకాలపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ సదస్సులు నిర్వహించనుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అధికారులు సూచిస్తున్నారు.