
మన దేశ జనాభా సుమారు 143 కోట్లకు పైమాటే. ఇంత జనాభా ఉన్న భారత దేశంలో కేవలం 13 నుంచి 14 కోట్ల మందికి మాత్రమే కనీస అవసరాలకు మించి ఖర్చు పెట్టగలిగే సత్తా ఉందంటే మీరు నమ్ముతారా..? నమ్మక తప్పని చేదు నిజం ఇది. Blume Ventures అనే వెంచర్ క్యాపిటర్ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలకు సంబంధించిన నివేదికను బయటపెట్టింది. మన దేశ జీడీపీ ఎక్కువగా వినియోగదారులు చేసే ఖర్చుల పైనే ఆధారపడి ఉందన్నది మనందరికీ తెలిసిన విషయం.
అయితే.. కనీస అవసరాలు కాకుండా ఖర్చు చేయగలిగే సామర్థ్యం భారతదేశంలో దాదాపు 100 కోట్ల మందికి లేదని.. ఏదైనా చిన్నాచితకా స్టార్టప్ కంపెనీ కూడా పెట్టలేని స్థితిలో బతుకుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో కనీస అవసరాలతో పాటు నచ్చిందల్లా కొనే వినియోగదారుల సంఖ్య పెరగడం లేదు. కానీ.. విచ్చలవిడిగా విలాసాల కోసం చేసే ఖర్చు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
అర్థమయ్యేలా చెప్పాలంటే.. కోట్లకు పడగలెత్తిన సంపన్నులు మరింత ధనవంతులు అవుతూ ఇష్టారీతిన డబ్బు ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతిలో, పేదరికంలో మగ్గిపోతున్న జనానికి ఖర్చు చేసేంత ఆదాయం రావడం లేదు. ఉదాహరణ చెప్పాలంటే.. ఓటీటీ, గేమింగ్ యాప్స్ సబ్స్క్రిప్షన్లపై ఖర్చు చేస్తున్న ధనవంతులు బతుకుతున్న ఈ దేశంలోనే.. వినోదంపై అంత ఖర్చు చేయలేక ఆ బొమ్మ, ఈ బొమ్మ అని కంటెంట్ చూస్తూ నెట్టుకొస్తున్న పబ్లిక్ కూడా ఉన్నారు. కంపెనీలు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తుల కంటే సంపన్నులు భారీగా డబ్బు వెచ్చించి కొనే ఉత్పత్తుల పైనే ఫోకస్ చేస్తు్న్న పరిస్థితి.
బడ్జెట్ ఫ్రెండ్లీలో మధ్య తరగతి వర్గం సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం ఐదేళ్ల క్రితం 40 శాతం ఉంటే ప్రస్తుతం అది 18 శాతానికి పడిపోయింది. లగ్జరీ ఇళ్లు, ప్రీమియం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల పైనే ఆయా రంగాలు దృష్టి సారిస్తున్నాయి. దీంతో.. బడ్జెట్ ఫ్రెండ్లీ అనే ఆప్షన్ చావలేక బతకలేక కొట్టుమిట్టాడుతోంది. జాతీయ ఆదాయంలో సంపన్నులుగా ఉన్న 10 శాతం భారతీయుల భాగస్వామ్యం 1990వ సంవత్సరంలో 34 శాతం ఉంటే ప్రస్తుతం 57.7 శాతం పెరిగింది. దేశ ఆదాయంలో మధ్య తరగతి వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. ఇదీ మన భారతీయుల బతుకు చిత్రం. మధ్య తరగతి బతుకు ఛిద్రం. ఇక.. నిరుద్యోగం, పేదరికం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలపై కూడా ప్రభావం పడుతున్న పరిస్థితి ఉంది.