
హైదరాబాద్: HCA (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) భారీ కుదుపునకు లోనైంది. హెచ్ఎసీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాస్ రావును కూడా పదవుల నుంచి తొలగించినట్లు పేర్కొంది. జులై 28, 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ వివరించింది.
నిధుల దుర్వినియోగం, మోసం, అధికార బలాన్ని దుర్వినియోగం చేసినట్లు ఈ ముగ్గురిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ, ఈడీ సంస్థలు ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు హెచ్ఎసీఏ వెల్లడించింది. హెచ్ఎసీఏ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పారదర్శకత, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని హెచ్ఎసీఏ కౌన్సిల్ స్పష్టం చేసింది. సంఘం న్యాయబద్ధతను కాపాడేందుకే చర్యలు తీసుకున్నామని హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఐపీఎల్ టికెట్ల ఇష్యూ, హెచ్సీఏ నిధుల గోల్ మాల్ కేసులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ టికెట్ల విక్రయానికి సంబంధించిన కాంట్రాక్టులు మాజీ మంత్రి కేటీఆర్‌బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్‌నౌ.కామ్, మేరా ఈవెంట్.కామ్ సహా పలు కంపెనీలకు అప్పగించారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు వివరాలు రాబడుతున్నారు. ఇందుకు సంబంధించి జగన్‌మోహన్‌రావు, శ్రీనివాసరావు, సునీల్ కాంటెను విడివిడిగా ప్రశ్నించారు. దేశవాళీ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ నుంచి వచ్చే నిధులతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి వాటాగా వచ్చే మొత్తాలను పక్కదారి పట్టించినట్టు వచ్చిన ఆరోపణలపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు.