KINGDOM Review: ‘కింగ్ డమ్’ ఫుల్ రివ్యూ.. విజయ్‌ దేవరకొండకు హిట్ ఇచ్చిందా..?

KINGDOM Review: ‘కింగ్ డమ్’ ఫుల్ రివ్యూ.. విజయ్‌ దేవరకొండకు హిట్ ఇచ్చిందా..?

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార బ్యానర్‌‌పై నాగవంశీ తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.  పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈరోజు (జులై 31న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరుస పరాజయాల్లో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా హిట్ ఇచ్చిందా.. లేదా.. అనేది ఫుల్‌ రివ్యూలో తెలుసుకుందాం...   

కథేంటంటే: 

సూర్య అలియాస్ సూరి (విజయ్ దేవరకొండ) ఓ పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన తన అన్న శివ (సత్యదేవ్‌) కోసం వెతుకుతుంటాడు. తన తెగువ, తెలివితేటలు చూసిన అధికారులు.. అతడిని ఓ స్పెషల్‌ ఆపరేషన్‌పై అండర్‌‌ కవర్‌‌ స్పై ఏజెంట్‌గా శ్రీలంకలోని జాఫ్నాకు పంపిస్తామంటారు. అతను స్పైగా వెళ్లబోయే గ్యాంగ్‌కు లీడర్‌‌ శివ.. సూరి వెతుకుతున్న తన అన్నయ్య ఒకరే. అన్నను వెనక్కి తీసుకొచ్చేందుకు స్పై ఏజెంట్‌గా శ్రీలంక వెళ్లిన సూరి.. అతని స్థానంలో మాఫియా కింగ్‌ ఎందుకు అయ్యాడు? శ్రీకాకుళం నుంచి వెళ్లిన తెలుగు వాళ్లు శ్రీలంకలో ఎందుకు ఉన్నారు? మురుగన్‌ (వెంకిటేష్‌ వీపీ)తో సూరి ఎందుకు తలపడ్డాడు? ఇందులో డా.అను (భాగ్యశ్రీ బోర్సే) పాత్రేమిటి అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే: 

శ్రీలంక నేరసామ్రాజ్యంలో కీలకవ్యక్తి అయిన తన అన్నను వెనక్కు తీసుకురావడం కోసం స్పై ఏజెంట్‌గా మారిన  ఒక సాధారణ కానిస్టేబుల్.. ఆ నేరసామ్రాజ్యానికి కింగ్ ఎలా అయ్యాడు అనేది ప్రధాన కథ. సినిమా ఫస్ట్ సీన్‌ నుంచే డైరెక్ట్‌గా కథలోకి వెళ్లిన దర్శకుడు ఫస్ట్ హాఫ్‌ను బాగా హ్యాండిల్ చేశాడు. రెగ్యులర్‌‌ సినిమాకు భిన్నంగా ఏదో చూడబోతున్నాం అనే ఫీల్‌ను ఫస్ట్ హాప్‌ కలిగిస్తుంది. హీరో పాత్ర తన టార్గెట్‌కు అనుగుణంగా ముందుకెళ్లడం,  విలన్‌ క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్ చేసిన తీరు,  సత్యదేవ్‌ పాత్ర ఇంపాక్టబుల్‌గా ఉన్నాయి. స్టోరీ కూడా డీవియేట్‌ కాకుండా సజావుగా సాగింది.

దర్శకుడి టేకింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, నటీనటుల పెర్‌‌ఫార్మెన్స్‌ కూడా అందుకు హెల్ప్ అయ్యాయి. అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ గాడి తప్పింది. అక్కడక్కడే తిరుగుతుంది. హీరో లక్ష్యం పక్కదారి పడుతుంది. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో తన పై ఆఫీసర్‌‌ను కొడితే ఏం జరుగుతుంది అని ముందుగానే లెక్కలు వేసుకున్న ఓ సాధారణ కానిస్టేబుల్‌.. స్పై ఏజెంట్‌గా మారాక తన చుట్టూ జరుగుతున్న వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం మేజర్‌‌ డ్రాబ్యాక్‌.

సత్యదేవ్ పాత్రకు సంబంధించి బ్యాక్‌ స్టోరీ ఏమిటనేది రివీల్ చేయకపోవడం లోటుగా అనిపిస్తుంది. పైగా ఇందులో పునర్జన్మ కాన్సెప్ట్‌ను కూడా మిక్స్ చేశారు. అది కూడా సరిగ్గా అతకలేదు. తన తెగను కాపాడుకోవడం కోసం డెబ్బై ఏళ్ల తర్వాత మళ్లీ పుట్టాడంటూ ఎలివేషన్ ఇచ్చారు. కానీ తన వాళ్లను విలన్‌ ఊచకోత కోస్తుంటే మరొక చోట హీరో లాక్ అయిపోవడం, అందుకు బలమైన కారణం లేకపోవడం కథలో ప్రధానమైన లోటుగా కనిపిస్తుంది.

పునర్జన్మ మాట అటుంచితే చిన్నప్పటి నుంచి వెతుకుతున్న తన అన్న కుటుంబం, అతడిని నమ్ముకున్న వాళ్లు ఆపదలో ఉంటే హీరో పాత్రను మరో చోట ఉంచడం కథతో పాటు హీరో క్యారెక్టర్‌‌ను అమాంతం పడేసింది. ఆ తర్వాత వచ్చి ఎన్ని యుద్ధాలు చేసినా, సైడ్ క్యారెక్టర్స్ పేజీల కొద్ది ఎలివేషన్ డైలాగ్స్‌ చెప్పినా హీరో క్యారెక్టర్‌‌ను పైకి లేవడం కష్టమైంది. దీంతో సీక్వెల్‌ సినిమాకు లీడ్‌ ఇవ్వడానికే క్లైమాక్స్‌ సీన్స్ పరిమితమయ్యాయి.

మొత్తంగా చూస్తే ఫస్ట్ హాఫ్‌ ఎంగేజింగ్‌గా రాసుకున్న దర్శకుడు.. సెకెండాఫ్‌లో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. టెక్నికల్‌గా ఎంతో రిచ్‌గా ప్లాన్‌ చేసిన మేకర్స్.. కాన్‌ఫ్లిక్ట్‌, క్యారెక్టర్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌ విషయంలో  మరింత దృష్టిపెడితే సినిమా ఎంగేజింగ్‌గా ఉండేది.  

ఎవరెలా.. 

సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ.  ముఖ్యంగా సూరి పాత్ర కోసం తను పడ్డ కష్టం, తన మేకోవర్‌‌ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే పోషించిన డా.అను పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ప్రమోషన్స్‌లో మెప్పించిన ఆమె పాటను కూడా సినిమా ఎడిటింగ్‌లో తీసేశారు.

అన్నగా సత్యదేవ్ పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. విలన్‌గా నటించిన వెంకిటేష్‌ అబ్బుర పరిచాడు. ‘విక్రమ్‌’లో సూర్య పోషించిన ‘రోలెక్ట్‌’ క్యారెక్టర్ స్థాయిలో తను పోషించిన మురుగాన్ పాత్ర హైలైట్‌ అయింది. అతను తెలుగులో బిజీ ఆర్టిస్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

టెక్నికల్‌గా..

ఈ సినిమాకు మెయిన్‌ ఎసెట్ అనిరుధ్ మ్యూజిక్. తన మ్యూజిక్‌తో ప్రతి సీన్‌ను నెక్స్ట్‌ స్టేజ్‌లో నిలబెట్టాడు. అలాగే గిరీష్‌ గంగాధరన్‌,  జోమోన్‌ టి జాన్‌ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ఆర్ట్‌ డైరెక్షన్‌, నవీన్ నూలి షార్ప్‌ ఎడిటింగ్‌ ఇంప్రెస్‌ చేశాయి. ఈ తరహా కథకు తగ్గట్టుగా ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ బాగున్నాయి.

దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి టేకింగ్ ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్‌ విషయంలో అది కనిపిస్తుంది.అయితే రెండు భాగాలుగా సినిమా తెరకెక్కించాలనుకునే క్రమంలో,  సీక్వెల్‌ సినిమాకు లీడ్ ఇవ్వడం కోసం అన్నట్టుగా సెకండాఫ్‌ దారి తప్పినట్టు కనిపిస్తోంది.  పైగా గత రెండు చిత్రాలతో ఎమోషనల్‌ సీన్స్‌ను బాగా హ్యాండిల్ చేయగలడని పేరు తెచ్చుకున్నాడు.

కానీ ఇందులోనూ అందుకు స్కోప్ ఉన్నప్పటికీ ఆ సీన్స్‌ అంతగా కనెక్ట్ కాలేదు. ఏదేమైనా రెగ్యులర్‌‌ సినిమాకు భిన్నంగా ఓ కొత్త తరహా నేపథ్యంలో కథ చెప్పాలనే దర్శకుడి ప్రయత్నం మెచ్చుకుని తీరాలి. మరి ప్రేక్షకులు ఎంతవరకూ ఈ చిత్రానికి విజయాన్ని ఇస్తారో చూడాలి!